సామాజిక విప్లవంతోనే బీసీల అభివృద్ధి
ఇల్లెందు : అతి తక్కువ జనాభా గల అగ్ర కులాల చేతిలో రాజ్యాధికారం బందీ అయిందని, బీసీలు బానిసలుగా మారారని, సామాజిక విప్లవంతోనే బీసీల బతుకులు మారుతాయని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఇల్లెందులో శనివారం జరిగిన బీసీ సంఘాల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పూలే, అంబేద్కర్, కొమురంభీం ఆశయ సాధనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలన్నీ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ మూడు వర్గాలు కలిసికట్టుగా పోరాడితేనే రాజ్యాధికారం లభిస్తుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత కానీ ఒక్కసారి కూడా బీసీలకు సీఎం పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పాలనలో ప్రాతినిధ్యం లేని వర్గాలు బానిసల కంటే హీనం’ అని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క బీసీ ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ లేరన్నారు. బీసీలకు వార్డు, గ్రామపంచాయతీ, కార్పొరేషన్ సీట్లు ఇస్తూ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను మాత్రం అగ్రవర్ణాల వారు కై వసం చేసుకుంటున్నార ని ఆరోపించారు. 90శాతం ఉన్న బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే.. మాధవరెడ్డి, గోపాల్‌రెడ్డి అనే ఇద్దరు కోర్టుకు వెళ్లి బిల్లును ఆపేయించారని అన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రకటించిన కాంగ్రెస్.. అఖిలపక్షంతో వెళ్లి ప్రధాని మోడీ ఇంటి ఎదుట ధర్నా చేయలేదని, రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో కనీసం 10 నిమిషాలు మాట్లాడలేదని విమర్శించారు. దీంతో తెలంగాణలో రాజకీయ ప్రభంజనం మొదలైందన్నారు. అందుకే రాష్ట్రంలో 12,736 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగగా ఎస్టీలకు 2వేల గ్రామపంచాయతీలు కేటాయించారని, 52 శాతం(5,321 గ్రామాల్లో) సర్పంచ్‌లుగా బీసీలు ఎన్నికయ్యారని వివరించారు. ఇదే స్ఫూర్తితో పోరాటం ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ కన్వీనర్ మడత వెంకట్‌గౌడ్, నాయకులు బుర్ర సోమేశ్వర్‌గౌడ్, ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, మడత రమ, బాస శ్రీనివాస్, ఆవునూరి మధు, ఎస్‌ఏ నబీ తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ జాజుల


