‘వేట’ ముగిసిందా ?! | - | Sakshi
Sakshi News home page

‘వేట’ ముగిసిందా ?!

Dec 13 2025 7:43 AM | Updated on Dec 13 2025 7:43 AM

‘వేట’ ముగిసిందా ?!

‘వేట’ ముగిసిందా ?!

అధికారుల బాధ్యత లేదా?

నలుగురి అరెస్టుతో సరిపెట్టిన అధికారులు ఆపై విచారణలో జాప్యం, గోప్యత ఇతరుల పాత్రను

సత్తుపల్లి: సత్తుపల్లి అర్బన్‌పార్కులో చుక్కల దుప్పులను తుపాకీతో వేటాడిన ఘటనలో నలుగురిని అరెస్ట్‌ చేసిన అటవీ శాఖ అధికారులు ఆ తర్వాత విచారణలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇందులో ఇతర వేటగాళ్ల పాత్ర ఉందా.. వారికి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో విచారణ ముందుకు సాగడం లేదు. అసలు విచారిస్తున్నారా, లేదా అన్న అంశంపై కూడా స్పష్టత లేకపోగా, అధికారులు ఏ అంశాన్ని బయటకు వెల్లడించకపోవడం చర్చకు దారి తీస్తోంది.

వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’

సత్తుపల్లి పార్క్‌లో దుప్పుల వేట సాగుతోందని, ఓ వ్యక్తి వివాహ విందులో దుప్పి మాంసం వడ్డించారనే సమాచారంతో ‘సాక్షి’లో గతనెల 29న ‘తూటా దూసుకెళ్తోంది..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో విషయం వెలుగులోకి రాగా వరుస కథనాలు వస్తుండడంతో అటవీ శాఖ అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. తొలుత ఇద్దరిని అరెస్ట్‌ చేయగా, వారం తర్వాత మరో ఇద్దరు తమ ఎదుట లొంగిపోయారని సత్తుపల్లి ఎఫ్‌డీఓ మంజుల ప్రకటించారు. ఆపై సైలెన్సర్‌ బిగించిన తుపాకీతో దుప్పులను వేటాడినట్లు గుర్తించామని, తదుపరి చర్యల కోసం రెండు జిల్లాల పోలీసు అధికారులు, భద్రాద్రి జిల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి నట్లు డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్‌ తెలిపారు.

జవాబు లేని ప్రశ్నలెన్నో..

దుప్పులను వేటాడినట్లు నలుగురిని అరెస్ట్‌ చేయగా, అందులో ఎవరి పాత్ర లేదా అన్న ప్రశ్నకు అటవీశాఖ అధికారులు సమాధానం చెప్పడం లేదు. సత్తుపల్లి, దమ్మపేట మండలాల నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా కొందరు వేటగాళ్లు వచ్చారనే ప్రచారం జరుగుతున్నా స్పష్టత ఇవ్వడంలేదు. ఐదు దుప్పులనే వేటాడారా.. ఇంకా ఎన్నింటిని హతమార్చారు, ఆ మాంసంను ఎక్కడ విక్రయించారనే వివరాలను.. రిమాండ్‌కు తరలించే ముందు వేటగాళ్లను విచారించి తెలుసుకునే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు చేశారా, లేదా అన్నది తెలియరావడం లేదు. ఇక దుప్పి మాంసాన్ని ఓ వివాహ విందులో వడ్డించినట్లు తెలిసినా, ఎవరెవరు హాజరయ్యారు, ఆ ఫంక్షన్‌ హాల్‌ పరిసరాల్లో ఆధారాలు సేకరించారా, హతమార్చిన వన్యప్రాణుల చర్మాలను స్వాధీనం చేసుకున్నారా అన్న ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. కాగా, వేటలో పాల్గొన్న దమ్మపేట మండలం తాటి సుబ్బన్నగూడెంనకు చెందిన మెచ్చా రఘు నుంచి రెండు తుపాకులు స్వాధీనం చేసుకోగా, ఆయన లైసెన్స్‌ను దుర్వినియోగం చేసినట్లుగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

సత్తుపల్లి అటవీశాఖ డివిజన్‌ పరిధిలో ఎఫ్‌డీఓ, రేంజర్‌, ఎఫ్‌ఎస్‌ఓ, బీట్‌ ఆఫీసర్లతో పాటు సుమారు 100 మందికి పైగా విధులు నిర్వర్తిస్తున్నారు. అర్బన్‌పార్కులో వరుస ఘటనలు జరుగుతున్నా.. ఏ ఒక్కరికీ కనీస సందేహం రాకపోవడం గమనార్హం. ఔట్‌సోర్సింగ్‌ విధానంలో విధులు నిర్వర్తిస్తున్న వారిపై నిఘా పెట్టడంలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా.. ఎవరిపైన చర్యలు తీసుకున్నారో వెల్లడించలేదు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను బాధ్యులుగా చేసి విధుల నుంచి తొలగించిన అధికారులు.. రెగ్యులర్‌ ఉద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియడం లేదు. ఈ అంశంపై సత్తుపల్లి ఎఫ్‌డీఓ వాడపల్లి మంజులను వివరణ కోరగా.. అంతర్గతంగా అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, అది పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

పట్టించుకోకపోవడంపై విమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement