అప్పుల బాధతో ప్రైవేట్ వైద్యుడి ఆత్మహత్య
అశ్వారావుపేటరూరల్: ఓ ప్రైవేట్ వైద్యుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ అఖిల కథనం ప్రకారం.. కోల్‌కతాకు చెందిన సర్కార్ న్యూటన్‌కుమార్ (42) సుమారు ఇరవై ఏళ్ల క్రితం పట్టణానికి వలస వచ్చి పాత ఆంధ్రాబ్యాంక్‌బజార్‌లో క్లినిక్ ఏర్పాటు చేసి, మొలల వ్యాధులకు సంప్రదాయ వైద్యం చేస్తున్నాడు. కొంతకాలంగా అప్పులు పెరిగిపోవడంతోపాటు మద్యానికి బానిసయ్యాడు. దంపతుల మధ్య కలహాలు చోటు చేసుకుంటున్నట్లు స్థానికులు చెప్పారు. మనస్తాపానికి గురైన సర్కార్ న్యూటన్‌కుమార్ శుక్రవారం ఉదయం తన క్లినిక్‌లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం. మృతుడి భార్య సర్కార్ రీనా ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ పేర్కొన్నారు. కాగా, ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సర్కార్ న్యూటన్ కుమార్ మృతదేహం వద్ద భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కంటతడి పెట్టిచింది. తండ్రి మృతదేహం దగ్గర కూర్చున్న పన్నెండేళ్ల కుమార్తె నాన్న కావాలి అంటూ రోదించడం అక్కడివారిని కలచివేసింది.
కాపురానికి రానన్న భార్య..
● ఆత్మహత్య చేసుకున్న భర్త
మణుగూరుటౌన్: మున్సిపాలిటీలోని చేపలమార్కెట్‌కి చెందిన ఓ వ్యక్తి భార్య కాపురానికి రాను అనడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. చేపలమార్కెట్‌కి చెందిన వాసుపల్లి విజయ్ (25) డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. 2022లో చర్లకు చెందిన యువతితో వివాహం జరగ్గా ఏడాదిన్నర పాప ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడాదిగా భార్య పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోందని పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం భార్యకు ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరగా, భార్య అంగీకరించకపోవడంతో విజయ్ మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడి తల్లి ధనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇంటికి నిప్పంటించిన
వ్యక్తి అరెస్టు
అశ్వాపురం: ఇంటికి నిప్పంటించిన వ్యక్తిని అశ్వాపురం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అశ్వాపురం ఎస్సీకాలనీ నివాసి కోడిపాక వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు.. మద్యానికి బానిసయ్యి ఇంటికి నిప్పంటించిన అతని మనవడు కోడిపాక నాగరాజుపై ఈ నెల 5వ తేదీన కేసు నమోదు చేశారు. నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.


