విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచాలి
పాల్వంచ/పాల్వంచరూరల్: విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్‌శర్మ అన్నారు. శుక్రవారం పట్టణంలోని బొల్లేరుగూడెం ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్ధులకు గాను 26 మంది మాత్రమే హాజరు కావడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులతో రోజూ మాట్లాడి, క్రమం తప్పకుండా విద్యార్థులు వచ్చేలా చూడాలని హెచ్‌ఎంకు సూచించారు. విద్యార్థుల ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ కోసం కేటాయించిన ట్యాబ్‌లు వినియోగించక పోవడంపై ప్రశ్నించారు. సిమ్ కార్డ్ లేకపోవడంతో కాంప్లెక్స్ హెచ్‌ఎంను నివేదిక పంపాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం కొందరు విద్యార్థులు ఇంటి నుంచి తీసుకురావడంపై ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ ఎస్‌కే సైదులు, ఎన్.సతీశ్‌కుమార్, కాంప్లెక్స్ హెచ్‌ఎం మంగమ్మ, ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మీప్రసన్న, ఉపాధ్యాయులు రాజశేఖర్, సీఆర్‌పీ గంగరాజు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, మండలంలోని జగన్నాథపురం జెడ్పీహెచ్‌ఎస్‌ను సైతం తనిఖీ చేశారు. తరగతి గదులు, పరిసరాలు శుభ్రంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్‌చార్జ్ హెచ్‌ఎం పాపారావు పాల్గొన్నారు.
అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్‌శర్మ


