కాంగ్రెస్‌లో బీసీలకు ప్రాధాన్యత లేదు
టీఆర్‌ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌కుమార్
అశ్వారావుపేటరూరల్ : కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ప్రాధాన్యత లేదని, మరో మూడు నెలల్లో ప్రభుత్వాన్ని కూలదోస్తారని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. సోమవారం అశ్వారావుపేటలో నిర్వహించిన సామాజిక చైతన్య రథయాత్రలో, ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకే సామాజిక చైతన్య రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పాలన బీఆర్‌ఎస్ కంటే అధ్వానంగా మారిందని విమర్శించారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని, మంత్రి కొండా సురేఖను సైతం ఉద్దేశ పూర్వకంగానే పక్కన పెడుతున్నారని ఆరోపించారు. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడకం ప్రసాద్ దొర, నాయకులు వెలుగు జాకబ్, భాస్కర్‌రావు, జానీ, బీరప్ప, సుధాకర్ పాల్గొన్నారు.


