ఏసీబికి చిక్కిన జీపీఓ
● భూ రిజిస్ట్రేషన్‌కు రైతు నుంచి రూ.60వేలు లంచం డిమాండ్ ● రూ.15 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న వైనం
ములకలపల్లి: ములకలపల్లి తహసీల్ పరిధి గ్రామ పరిపాలనాధికారి(జీపీఓ) బానోత్ శ్రీనివాస్ నాయక్ లంచం తీసుకుంటూ అవినీతీ నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కాడు. రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఆయనను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ములకలపల్లి మండలం వేముకుంటకు చెందిన ఓ రైతు తాను కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం ఈనెల 22 స్లాట్ బుక్ చేసుకున్నాడు. అయితే, ఆ భూమిపై బ్యాంక్ రుణం బకాయి ఉన్నందున రూ.60 వేలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని పూసుగూడెం క్లస్టర్ జీపీఓ బానోతు శ్రీనివాస్‌నాయక్ స్పష్టం చేశాడు. దీంతో సదరు రైతు ఫోన్‌పే ద్వారా రూ.30వేలు, నగదుగా రూ.10వేలు ముట్టజెప్పాడు. మిగతా రూ.20వేలు ఇవ్వాల్సిందేనని జీపీఓ స్పష్టం చేయడంతో రూ.15 వేలకు రైతు బేరం కుదుర్చుకున్నాడు. ఆపై ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈమేరకు తహసీల్‌లో శ్రీనివాస్ నాయక్ సోమవారం రైతు నుంచి రూ.15 వేలు తీసుకుంటుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాగా, వసూళ్లలో ఇతర ఉద్యోగుల పాత్రపైనా విచారణ చేపడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. అయితే, పట్టుబడిన జీపీఓ శ్రీనివాస్‌నాయక్ నెలన్నర క్రితమే విధుల్లోకి చేరడం గమనార్హం. కాగా తహసీల్‌లో అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. తహ సీల్దార్ గన్యానాయక్‌ను కూడా విచారించినట్లు సమాచారం.
పాల్వంచలో సోదాలు..
పాల్వంచ: పట్టణంలోని అయ్యప్పనగర్‌లో గల శ్రీనివాస్ నాయక్ ఇంట్లో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. పలు డాక్యుమెంట్లు, బ్యాంక్ అకౌంట్లు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఎవరి పేర్లతో ఉన్నాయనే కోణంలో తనిఖీ చేసినట్లు సమాచారం.


