వెండితెరపై గుమ్మడి
వారిద్దరు ఇంకా కలుసుకోలేదు
ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే నర్సయ్య బయోపిక్ చిత్రీకరణ
ఆయన పాత్రలో నటిస్తున్న
కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్
ఇటీవల విడుదలైన మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన
చిత్ర విశేషాలు ‘సాక్షి’తో పంచుకున్న చిత్ర దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటికీ సాధారణ జీవితం గడిపే గుమ్మడి నర్సయ్య గురించి తెలుసుకునేందుకు జెన్ జెడ్ తరం కూడా ఆసక్తి చూపిస్తోంది. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమా తెరకెక్కనుంది. కన్నడ స్టార్‌హీరో శివరాజ్‌కుమార్ గుమ్మడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే తన జీవితంలో ఆచరించిన ఆదర్శాలను ఈ తరానికి మరింత స్పష్టంగా పరిచయం చేయబోతున్న దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే ఈ చిత్రం గురించి చెప్పిన విశేషాలు.
మూడేళ్ల పాటు రీసెర్చ్
మాది కామారెడ్డి. సినిమా రంగంలో పదేళ్లుగా ఉన్నాను. చిన్నప్పుడే కమ్యూనిస్టు యోధులు తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్యల జీవిత చరిత్ర చదివాను. ఆ తర్వాత అలాంటి ఆదర్శాలతో జీవించే రియల్‌టైం పొలిటీషియన్ కోసం ఆరా తీసే క్రమంలో ఇల్లెందు వచ్చి గుమ్మడి నర్సయ్యను కలిశాను. 2019 నుంచి మూడేళ్లపాటు ఆయనతో ట్రావెల్ చేసిన వారు, ఆయన చేతిలో ఓడిపోయిన వారు ఇలా అనేక మందిని కలిసి పూర్తి స్థాయిలో సినిమా స్క్రిప్టు రెడీ చేసుకున్నాను. ఐదు సార్లు ఒకే చోటనుంచి ఎన్నిక కావడమనేది సామాన్యమైన విషయం కాదు. ఎంతో నిజాయితీ ఉంటేనే ఇలా జరుగుతుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను తెరపై జరిగే సన్నివేశాలతో లీనమయ్యే చేయగలిగితే సినిమా హిట్టే. గుమ్మడి జీవిత చరిత్రలో ఐదు గంటల పాటు కూర్చోబెట్టగలిగేంత విషయం ఉంది.
రెండేళ్లపాటు
గుమ్మడి జీవిత కథతో సినిమా తీసేందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టింది. హీరోలకు కథ నచ్చితే నిర్మాతలు దొరకలేదు. నిర్మాతలు దొరికితే కథకు తగ్గ హీరోలు దొరకలేదు. ఇద్దరు లభిస్తే.. కథలో మార్పులు చేర్పులు సూచించేవారు. ఇలాంటి సినిమాలు తమిళ్, మలయాళంలో ఆడుతాయి కానీ మన దగ్గర నడవవు. చివరకు పాల్వంచకు చెందిన ఎన్.సురేశ్‌రెడ్డి ప్రవళ్లిక ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించేందుకు ముందుకు వచ్చారు.
కేవలం 20 రోజుల్లో..
ఏడాదిన్నర క్రితం స్క్రిప్టును కన్నడ స్టార్‌హీరో డాక్టర్ శివరాజ్‌కుమార్‌కు పంపించాను. బెంగళూరు రావాలని సెప్టెంబరులో ఆయన మేనేజర్ నుంచి కాల్ వచ్చింది. అప్పటి నుంచి కేవలం ఇరవై రోజుల్లోనే శివరాజ్‌కుమార్ గుమ్మడి పాత్రను చేసేందుకు అంగీకరించడంతో పాటు ఒక రోజు షూట్‌లో పాల్గొనడంతో టీజర్ రిలీజ్ చేశాం. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్ జిల్లాలోని పలు లొకేషన్లలో షూటింగ్ జరిపేలా ప్లాన్ చేస్తున్నాం. గుమ్మడి పాత్రలో కనిపించేందుకు శివరాజ్‌కుమార్ చాలా ఉత్సాహంతో ఉన్నారు.
రియల్ హీరో గుమ్మడి నర్సయ్య రీల్ హీరో శివరాజ్‌కుమార్‌లు ఇంకా నేరుగా కలుసుకోలేదు. కేవలం ఫోన్‌లోనే ఇద్దరూ మాట్లాడుకున్నారు. షూటింగ్‌కు ముందు ఒకసారి ఇద్దరు కలిసే అవకాశముంది. గుమ్మడి నర్సయ్య ట్రైలర్ రిలీజైన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా గుమ్మడి గౌరవం పెంచేలా భావి తరాలకు స్ఫూర్తిని ఇచ్చేలా ఈ చిత్రం ఉండబోతోంది.
వెండితెరపై గుమ్మడి


