‘రామయ్య’కు ఇంటిపోరు!
● రామాలయంలో సిబ్బంది మధ్య వర్గవిభేదాలు ● నూతన ఈఓకు తలనొప్పిగా మారిన వ్యవహారం ● భద్రాచలం ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే పరిస్థితి!
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఇంటి పోరు రచ్చకెక్కుతోంది. అధికారులు, సిబ్బంది నడుమ పొసగకపోవడంతో ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఆలయ అభివృద్ధిపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. వెరసి ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఈఓ దామోదర్‌రావుకు తలనొప్పిగా మారింది.
కొత్త ఈఓ వచ్చాక
రెండుసార్లు అంతర్గత బదిలీలు
గతంలో పనిచేసిన ఈఓ ఎల్.రమాదేవి ఆలయ పాలనను గాడిలో పెట్టేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. అంతర్గత బదిలీలను చేపట్టి అక్రమార్కులకు చెక్ పెట్టారు. రామయ్య సొమ్మును మింగిన అవినీతి పరుల వద్ద నుంచి రికవరీ చేశారు. ఈ సమయంలో పలువురిని ఇతర విభాగాలకు, పర్ణశాలకు బదిలీ చేశారు. రమాదేవి బదిలీ కాగానే బాధ్యతలు చేపట్టిన దామోదర్‌రావు కూడా రెండుసార్లు అంతర్గత బదిలీలు చేపట్టారు. ఇందులో రెండోసారి భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి ఈఓ పలు కారణాలతో దూరంగా ఉంచిన వారికే అధిక ప్రాధాన్యతను ఇస్తూ బదిలీ చేశారు. దీంతో వర్గపోరు ఉత్పన్నమైంది.
విధుల్లో చేరేందుకు విముఖత?
అంతర్గత బదిలీలు చేశాక చాలా మంది వెంటనే విధుల్లో చేరలేదు. దీంతో విధుల్లో చేరాలని ఈఓ దామోదర్‌రావు మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా విభాగాల బాధ్యతలను అప్పగించకుండా కొందరు జాప్యం చేశారు. తమను కక్షపూరితంగా, క్లిష్టమైన విభాగాలకు బదిలీ చేశారని మరికొందరు తాత్సారం చేశారు. గతంలో ఈఓకు అటెండర్‌గా పని చేసిన ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఎంపీ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ద్వారా పైరవీ చేయించుకోగా, ఈఓ తప్పనిసరి పరిస్థితుల్లో లడ్డూ విభాగం నుంచి విధులను మరో చోటికి మార్చటం గమనార్హం. ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న మరో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగినికి ప్రొటోకాల్‌తో పాటు మరో కొన్ని పనులను అప్పగించారు. కానీ ఆమె విముఖత చూపుతూ అనారోగ్యమంటూ సెలవు పెట్టారు. ఇలా కొందరు విధుల్లో చేరకపోవడంతో వీరి స్థానాల్లో వెళ్లాల్సిన వారు అలాగే ఆగిపోయారు.
గతంలో చక్రం తిప్పినవారే మళ్లీ..
రమాదేవి ఈఓగా బాధ్యతలు స్వీకరించక ముందు దేవస్థానంలో చక్రం తిప్పినవారు తిరిగి యథా స్థానాలకు రావడంతో వర్గ పోరుకు బీజం పడింది. ఆలయంలో సస్పెన్షన్‌కు గురై మళ్లీ విధుల్లో చేరిన ఓ కీలక అధికారి, పలు కాంట్రాక్ట్‌లు చేపట్టిన ఓ వ్యక్తి, కన్సాలిటెడ్‌గా పని చేస్తున్న మరో ఉద్యోగి తిరిగి ఆలయంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఓ వర్గం వాదిస్తోంది. అందుకు తగినట్లుగానే అంతర్గత బదిలీలను చేపట్టారని, అవి అసంబద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తోంది. సీనియారిటీ ఆధారంగా కాకుండా బదిలీలు కేవలం కక్షపూరితంగా చేపట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, అంతర్గత బదిలీలు సాధారణమేనని, ఇందులో ఎటువంటి వ్యక్తిగత కక్షలు ఉండవని మరోవర్గం పేర్కొంటోంది.
రచ్చకెక్కుతున్న వర్గపోరు
డిసెంబర్ చివరిలో ముక్కోటి మహోత్సవం జరగనుంది. ఆలయ మాస్టర్‌ప్లాన్‌పై సమాలోచనలు జరుగుతున్నాయి. ఇటువంటి కీలక తరుణంలో వర్గపోరు భక్తులను కలవరపెడుతోంది. రెవెన్యూ శాఖ నుంచి దేవస్థానం ఈఓగా వచ్చిన దామోదర్‌రావుకు ఉద్యోగులు, సిబ్బందిని గాడిన పెట్టడం సవాల్‌గా మారింది. దీనికితోడు గత గురువారం ఆలయంలో ఓ కాంట్రాక్టర్ ఎస్‌టీఎఫ్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన వ్యవహారం మరోవర్గం వాదనకు ఊతమిచ్చేలా ఉండటం ఆయనను మరింత కలవరపెట్టింది. ఈఓ ఉద్యోగుల మధ్య సమన్వయం సాధిస్తేనే భక్తుల వసతుల కల్పన, ఉత్సవాల విజయవంతం, ఆలయ ప్రతిష్టకు భంగం రానివ్వకుండా ఉండటం, ఆలయ మాస్టర్ ప్లాన్ వంటివి సాఫీగా ముందుకు సాగుతాయి.


