వైభవోపేతంగా గంగాహారతి
కాశీ తరహాలో ఇక్కడ ఏటా గంగాహారతిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కార్తీకపౌర్ణమి రోజు జరిపే వేడుకలో శ్రీదేవి, భూదేవి సమేత బాలాజీ వేంకటేశ్వరుడు శేషవాహనంపై శివాలయానికి చేరుకుంటారు. దారి పొడవునా భక్తజనం దర్శించుకుంటుండగా, శివాలయ ప్రతినిధులు శ్రీనివాసునికి స్వాగతం పలుకుతారు. శివపార్వతులు ఎదురేగుతారు. ఇక్కడ దేవలతకు జ్వాలాతోరణంతో సాదర స్వాగతం పలుకుతారు. భక్తుల జయజయ ధ్వానాల నడుమ శివపార్వతులు, శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఉత్సవ వేదికపైకి చేరుకుంటారు. ఆ తర్వాత ఆయా దేవతల సాక్షిగా వేదమంత్రోచ్ఛరణ నడుమ గంగమ్మకు హారతి సమర్పిస్తారు. ఈ విశిష్ట ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు భక్తజనం పోటెత్తుతారు.


