● కోత దశలో నేలవాలుతున్న వరి ● తడిసి పాడవుతున్న పత్తి, మక్కలు
బూర్గంపాడు/గుండాల: పంటచేతికి వచ్చే సమయంలో కూడా వర్షాలు కురుస్తుండటంతో రైతులు కుదేలవుతున్నారు. వరి, పత్తి, మొక్కజన్న పంటలు దెబ్బతింటున్నాయి. మూడురోజులుగా జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షాలకు కోతకు వచ్చిన వరిపంట నేలవాలుతోంది. ఇప్పటికే వరికోతలు ప్రారంభించాల్సి ఉండగా, వానల కారణంగా ఆలస్యమవుతున్నాయి. అధిక వర్షాలు ఈ ఏడాది పత్తిపంటకు కూడా ప్రతికూలంగా మారాయి. పూసిన పత్తిని తీసుకునేందుకు వర్షాల కారణంగా వీలుకాని పరిస్థితులు నెలకొన్నాయి. తొలివిడత పత్తితీతలు ప్రారంభమవుతున్న తరుణంలో తరచు వర్షాలు కురుస్తుండటంతో పత్తి తీసేందుకు ఇబ్బందికరంగా మారింది. దూది తడిసి నల్లబడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
వర్షంతో తడిసిన మొక్కజొన్న
వర్షంతో ఆరబోసిన మొక్కజొన్నలు గురువారం కురిసిన వర్షానికి తడిసిపోయాయి. గుండాల మండలంలో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేయగా, ఇప్పుడిప్పుడే రైతులు కోతలు మొదలు పెట్టారు. విరిసిన మొక్కజొన్న కంకులను కల్లాల్లో, మిల్లర్ పట్టిన మక్కలను రోడ్లపై ఆరబోశారు. బుధవారం నుంచి మబ్బులు కమ్ముతూ తేలికపాటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన మక్కలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.టార్బాలిన్లు కప్పుతున్నా ఫలితం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం త్వరితగతిన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు.
వర్షంతో దెబ్బతింటున్న పంటలు


