ఆశావహులకు ఊరట!
2019 పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులు(సర్పంచ్,వార్డులకు)
ఇక నుంచి ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే 30 ఏళ్లుగా కొనసాగుతున్న రూల్స్‌కు స్వస్తి
చుంచుపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నవారు అనర్హులు అనే నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయాలని తాజాగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పలువురు ఆశావహులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్న అభ్యర్థులు మాత్రమే పోటీకి అర్హులని నిబంధన ఉండటంతో చాలా మంది స్థానిక ఎన్నికల బరిలో నిలబడే అవకాశం కోల్పోయారు. సర్పంచ్, వార్డు సభ్యుడిగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేద్దామనే యోచన ఉన్నా ముగ్గురు పిల్లలు ఉండటంతో ఎన్ని కలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇటీవలే హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా కూడా చేశారు. ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి ఆమోదంతెలపడంతో ఆశావహులకు ఊరట కలగనుంది. దీనిపై ప్రభుత్వం చట్ట సవరణ వైపు అడుగులు వేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే కొత్త విధానం అమల్లోకి రానుంది.
1995 నుంచి ఇద్దరు పిల్లల నిబంధన
రాష్ట్రంలో జనాభా నియంత్రణతోపాటు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉన్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1995లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరు పిల్లలు మాత్రమే అనే నిబంధనను తీసుకొచ్చింది. 1995 మే 31 కంటే ముందు ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. కానీ 1995 జూన్ 1 నుంచి ముగ్గురు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు పోటీకి అనర్హులు. అప్పటినుంచి 30 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే ఆశావహులకు ముగ్గురు పిల్లల నిబంధనలు కొంత అవరోధంగా నిలిచాయి. తెలంగాణ వచ్చాక తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం కూడా స్థానిక బరిలో నిలిచే అభ్యర్థులు ముగ్గురు పిలల్లను కలిగి ఉంటే అనర్హులు అవుతారంటూ పాత నిబంధనలే అమలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో ఇప్పటివరకు ఉన్న ముగ్గురు పిల్లలు నిబంధనలను తొలగించేందుకు ముందుకురావడం శుభపరిణామం. ఈ నిబంధనలు 30 ఏళ్లుగా అమల్లో ఉన్నాయి. దీని వల్ల చాలా మంది ఆశావహులు ఎన్నికల్లో పోటీ చేసే వీలు లేకుండా పోతోంది. గ్రామాల అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి రావాలనుకునే వారికి కొంత అడ్డంకిగా మారాయి. ప్రభుత్వం ఈ నిబంధన ఎత్తివేయనుండటంతో ఆశావహులకు ఊరట కలుగుతుంది.
– బోడా శారద, మాజీ ఎంపీటీసీ, త్రీ ఇంక్లైన్
ఈ నిబంధనను పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల తొలగించారు. దీంతో తెలంగాణలో కూడా ఎత్తివేయాలంటూ పలు వర్గాల ప్రజల నుంచి డిమాండ్లు తెర మీదకు వచ్చాయి. వినతులు, డిమాండ్లతో పాటు రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు, కుటుంబ నియంత్రణపై ప్రజల్లో పెరిగిన అవగాహనను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం మంత్రి మండలి ఆమోదించింది. ఇక ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్, మున్సిపాలిటీల చట్ట సవరణకు ఏర్పాట్లు చేస్తోంది. కాగా బీసీ రిజర్వేషన్ల కారణంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కోర్టు పరిధిలో ఉన్న బీసీ రిజర్వేషన్ల జీఓ, బిల్లు విషయం తేలేలోపే ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
విడత పంచాయతీలు వార్డులు బరిలోఉన్న వారు
మొదటి 174 1,534 3,265
రెండో 142 1,294 2,708
మూడో 163 1,404 3,635
స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనల్లో మార్పు
ఆశావహులకు ఊరట!


