‘డైలీవేజ్’ సమ్మె విరమణ
42 రోజులపాటు
ఆందోళన చేపట్టిన కార్మికులు
జిల్లాలో ఔట్ సోర్సింగ్, డైలీవేజ్ వర్కర్లు 501 మంది
జీతం తగ్గించకుండా చెల్తిస్తామని
మంత్రి లక్ష్మణ్ హామీ
ఇల్లెందు: డైలీవేజ్ ఔట్ సోర్సింగ్ వర్కర్లు ఆందోళన విరమించారు. తగ్గించిన వేతనం కోసం 42 రోజులపాటు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు, ఐటీడీఏ పీఓ, కలెక్టరేట్‌లను ముట్టడించారు. గురువారం రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్‌లోని తన చాంబర్‌లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల డైలీవేజ్, ఔట్ సోర్సింగ్ కార్మిక సంఘాల ప్రతినిధులు, సీఐటీయూ నేతలతో సమావేశమై చర్చించారు. పాత జీతం యథావిధిగా కొనసాగించేలా చూస్తామని, 3 నెలల లోపు సమస్యలను శాశ్వతంగా పరిష్కంచేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని, దీంతో సమ్మె విరమించినట్లు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి తెలిపారు.
గత నెల 12 నుంచి దీక్షలు
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేసే కార్మికులు గత నెల 12 నుంచి రిలే దీక్షలు చేపట్టారు. డైలీవేజ్ వర్కర్లకు వేతనం రూ.26 వేలు ఉండగా, జీఓ 64 తీసుకుని వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ.11,700 చెల్లిస్తామని ప్రకటించింది. ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనం రూ.15,600 ఉండగా రూ. 9,200 చెల్లిస్తామని పేర్కొంది. దీంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. జిల్లాలో 413 మంది డైలీవేజ్ వర్కర్లు, 88 మంది ఔట్ సోర్సింగ్ వర్కర్లు ఉన్నారు. వీరంతా ఆందోళన చేపట్టగా, మంత్రి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.


