నిధుల గ్రహణం | - | Sakshi
Sakshi News home page

నిధుల గ్రహణం

Aug 7 2025 7:42 AM | Updated on Aug 7 2025 8:04 AM

నిధుల గ్రహణం

నిధుల గ్రహణం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాకు 2021లో వైద్య కళాశాల మంజూరైంది. దీనికి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీ కూడా వచ్చింది. మెడికల్‌ కాలేజీ కంటే ముందుగానే నర్సింగ్‌ కాలేజీ భవనాలు నిర్మించగా.. వాటిలోనే వైద్య విద్యార్థులకు కూడా బోధన సాగుతోంది. ఇక ఐడీఓసీకి సమీపంలోనే 2023లో వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. హాస్టల్‌, తరగతి గదులు, మెస్‌, రెసిడెంట్‌ డాక్టర్ల క్వార్టర్లు తదితర తొమ్మిది రకాల భవనాలు నిర్మిస్తున్నారు. అకడమిక్‌ క్లాసులు నిర్వహించే భవనం జీ ప్లస్‌ 4, బాలుర, బాలికల హాస్టళ్లు జీ ప్లస్‌ 5 పద్ధతిలో నిర్మించాల్సి ఉంది. మెస్‌, స్టాఫ్‌ క్వార్టర్లు జీ ప్లస్‌ 2గా నిర్మించాలని, ఈ పనులన్నీ 2024 డిసెంబర్‌ నాటికి పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

బిల్లులు పెండింగ్‌లో..

మెడికల్‌ కాలేజీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు కళాశాల నిర్వహణకు, భవన నిర్మాణ పనులకు పదే పదే నిధుల గ్రహణం పడుతోంది. ఇప్పటికే రెండుసార్లు బిల్లులు పెండింగ్‌ ఉండడంతో ని ర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్‌ సంస్థ పనులు పక్కనపెట్టింది. సాంకేతిక ఇబ్బందులు రావొద్దనే ఉద్దేశంతో 200 మంది కార్మికులు పని చేయాల్సిన చోట నలుగురు, ఐదుగురితో తూతూ మంత్రంగా పనులు చేయిస్తున్నారు. ఇప్పటివరకు చేపట్టిన నిర్మాణాలకు సంబంధించి రూ.27 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.

పెరుగుతున్న వ్యయం..

మెడికల్‌ కాలేజీ, భవన నిర్మాణ పనులు 2023లో ప్రారంభమయ్యాయి. కాగా, బిల్లులు మంజూరు కావడం లేదంటూ నిర్మాణ పనులు మధ్య మధ్య నెలల తరబడి నిలిచిపోతున్నాయి. తిరిగి మొదలయ్యే సరికి సామగ్రి ధరల సవరణతో నిర్మాణ వ్యయం పెరుగుతోంది. ఆరంభంలో ఈ భవనాల నిర్మాణ వ్యయం రూ.105 కోట్లు కాగా, తొలి సవరణలో రూ.130 కోట్లకు, రెండో సవరణలో రూ.147 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం పనులు ఆగిపోయి ఉన్నాయి. మరోసారి అంచనా వ్యయం సవరణ జరిగితే ఇది రూ.178 కోట్లకు చేరుకుంటుందని నిర్మాణ రంగ నిపుణులు అంటున్నారు. నిధుల సర్దుబాటులో జాప్యంతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతుండగా అటు విద్యార్థులకూ ఇబ్బందులు తప్పడం లేదు.

ఎవరికీ పట్టింపు లేదు..

మెడికల్‌ కాలేజీలో 2022 – 23 విద్యాసంవత్సరంలో 150 మంది విద్యార్థులతో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. నర్సింగ్‌ కాలేజీలో బోధన.. అద్దె భవనాల్లో హాస్టళ్లు కొనసాగుతున్నాయి. హాస్టళ్ల నుంచి కళాశాలకు విద్యార్థుల రాకపోకలకు కనీసం బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. ఆటోల్లో వచ్చి పోతూ విద్యార్థులు ప్రమాదాలకు గురైన ఘటనలూ ఉన్నాయి. కలెక్టర్‌గా ప్రియంకా ఆల ఉన్న సమయంలో కాలేజీ విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఇంత జరుగుతున్నా.. ఇప్పటి వరకు మెడికల్‌ కాలేజీ నడుస్తున్న తీరు తెన్నులపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అటు జిల్లా ఉన్నతాధికారులు ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. ఈ కాలేజీ మీదుగానే రాకపోకలు సాగిస్తూ.. మాట వరసకై నా విద్యార్థులను పలకరించిందీ లేదు.

అర్ధంతరంగా ఆగిన వైద్య కళాశాల నిర్మాణం

2023లో ప్రారంభమైన పనులు

2024 డిసెంబర్‌ నాటికే పూర్తి కావాలని లక్ష్యం

ఇప్పటి వరకు 70 శాతమే పూర్తయిన సివిల్‌ పనులు

70 శాతం పనులు పూర్తి..

కళాశాల అకడమిక్‌ భవనం, హాస్టళ్లు, రెసిడెంట్‌ వైద్యుల క్వార్టర్లు, మెస్‌ పనులు 70 శాతం మేర పూర్తయ్యాయి. శ్లాబ్‌, కాంక్రీట్‌, గోడల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. సివిల్‌ పనులు పూర్తయితే ఆ తర్వాత డ్రెయినేజీ, విద్యుత్‌, పెయింటింగ్‌ పనులు జరగడమే తరువాయి అనుకున్న సమయంలో పనులు మళ్లీ అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసి, శర వేగంగా పనులు చేపట్టినా.. మరో ఏడాది గడిస్తే కానీ ఈ కాలేజీ భవనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement