
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
బాలికలు క్రీడల్లో
రాణించాలి
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం: క్రీడల్లో బాలికలు రాణించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. ఇటీవల హనుమకొండలో జరిగిన 34వ సౌత్ జోన్ మీట్‌లో భద్రాచలానికి చెందిన పృథ్విక జావెలిన్ త్రోలో రెండో స్థానం, ఎస్‌కే అమ్రిన్ 100 మీటర్ హ్యాండిల్స్‌లో రెండో స్థానం సాధించారు. శుక్రవారం పీఓ వారిని తన చాంబర్‌లో అభినందించారు. ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో రాణించాలని సూచించారు. కాగా పీఓ రాహుల్ ఒక ప్రకటనలో రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. కుంజా ధర్మ, పూణేం కృష్ణ, గుండు శరత్, కనితి రాద, శ్రీదేవి, నాగమణి, కోచ్‌లు జున్ను, గిరి ప్రసాద్ పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి
భద్రాచలంటౌన్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు ఆదివాసీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు సహకరించాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన సమితి సభ్యులతో సమావేశమై ఆదివాసీ వేడుకల ఏర్పాట్లపై మాట్లాడారు. అతిథులకు ఆదివాసీ వంటకాల రుచి చూపించాలని చెప్పారు. శనివారం వివిధ ఆదివాసీ తెగల గిరిజనులతో ర్యాలీ నిర్వహిస్తామని, మహనీయులకు విగ్రహాల వద్ద నివాళి, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ ప్రతినిధులు పూనెం కృష్ణ, కుంజా ధర్మ, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.
పులి సంచారంపై అటవీశాఖ అప్రమత్తం
ఇల్లెందురూరల్: పాఖాల కొత్తగూడెం సమీపంలోని రాంపూర్ అటవీ ప్రాంతంలో పశువును చంపిన ఘటనతో పులి సంచరిస్తున్నట్లు శుక్రవారం అక్కడి అటవీశాఖ అఽధికారులు నిర్ధారించారు. పులి పాఖాల కొత్తగూడెం నుంచి పాండవుల గుట్ట మీదుగా గుండాల మండలం వైపుగా సంచరిస్తుందని గతంలో చోటుచేసుకున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. శుక్రవారం రాంపూర్, లక్నవరం మధ్య అటవీప్రాంతంలో పులి ఉన్నట్లు ధ్రువీకరించిన అటవీశాఖ అధికారులు, దాని సంచారంపై నిఘా పెంచారు. ఈ క్రమంలో జిల్లా అటవీశాఖ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. పాఖాల కొత్తగూడేనికి సమీపంలో ఉన్న ఇల్లెందు, కొమరారం, గుండాల రేంజ్ అధికారులు అప్రతమత్తమై అడవిలో నిఘా పెంచినట్లు ఇల్లెందు ఎఫ్‌డీఓ కరుణాకరాచారి తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున పులి సంచరిస్తే పాదముద్రలను సులువుగా గుర్తించవచ్చని పేర్కొన్నారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఉమ్మడి జిల్లాకు 3వేల మెట్రిక్ టన్నుల యూరియా
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లా అవసరాల కోసం 3,001 మెట్రిక్ టన్నుల క్రిబ్–కో యూరియా సరఫరా అయింది. ఖమ్మం జిల్లా పందిళ్లపల్లి రైల్వే రేక్ పాయింట్‌కు యూరియా చేరగా.. ఖమ్మం జిల్లాకు 1,501, భద్రాద్రి జిల్లాకు 1,400 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. మిగిలిన 100మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేశారు. జిల్లాల వారీగా కేటాయించిన యూరియాను పీఏసీఎస్‌లు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా విక్రయిస్తారు.

పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం