25 పనిదినాలు.. 24 రోజులు ఫేక్‌ అటెండెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

25 పనిదినాలు.. 24 రోజులు ఫేక్‌ అటెండెన్స్‌

Aug 9 2025 5:07 AM | Updated on Aug 9 2025 5:07 AM

25 పనిదినాలు.. 24 రోజులు ఫేక్‌ అటెండెన్స్‌

25 పనిదినాలు.. 24 రోజులు ఫేక్‌ అటెండెన్స్‌

ఇది బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామపంచాయతీ కార్యాలయం. ఇక్కడ గ్రేడ్‌–2 కార్యదర్శి పనిచేస్తున్నారు. గత నెలలో 31 రోజులకు నాలుగు ఆదివారాలు, ఒక శనివారం, బోనాల పండుగకు కలిపి ఆరు సెలవులు వచ్చాయి. 25 పనిదినాలు ఉండగా, పంచాయతీ కార్యదర్శి 24 రోజులు ఫేక్‌ అటెండెన్స్‌ నమోదు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. నెలమొత్తమ్మీద ఒక రోజు మాత్రం సక్రమంగా హాజరైనట్లు తేలింది. అది కూడా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశానికి జిల్లాలోని కార్యదర్శులందరూ హాజరైన సందర్భం. ఇక బూర్గంపాడు మండలంలోనే బూర్గంపాడు కార్యదర్శి(గ్రేడ్‌– 2), లక్ష్మీపురం కార్యదర్శి(గ్రేడ్‌–4) 24 రోజులు, తాళ్లగొమ్మూరు కార్యదర్శి(గ్రేడ్‌–3) 23 రోజులు తప్పుడు హాజరు నమోదు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. భద్రాచలంలో పనిచేస్తున్న గ్రేడ్‌–1 కార్యదర్శి కూడా 24 రోజులు ఫేక్‌ అటెండెన్స్‌ నమోదు చేసుకున్నారు. టేకులపల్లి మండలం తడికలపూడి కార్యదర్శి (గ్రేడ్‌–3) 21 రోజులు తప్పుడు హాజరు నమోదు చేసుకున్నట్లు అధికారులు తేల్చారు.

చుంచుపల్లి: గ్రామ పంచాయతీల్లో కీలకంగా వ్యవహరించే కార్యదర్శులు కొందరు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తప్పుడు హాజరు నమోదు చేసుకున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. జిల్లాలో తప్పుడు హాజరు నమోదు చేసుకున్న 42 మంది పంచాయతీ కార్యదర్శులను అధికారులు గుర్తించి నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. వీరిలో కొందరిపై వేటు పడనుందనే చర్చ జోరుగా జరుగుతోంది. గత నెలలో కొందరు అత్యధికంగా 21, 23, 24 రోజులపాటు తప్పుడు హాజరు నమోదు చేసినట్లు తేలింది. 20 రోజులకు పైగా తప్పుడు హాజరును నమోదు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. దీన్నే ప్రామాణికంగా తీసుకుని కొన్ని జిల్లాల్లో కార్యదర్శులను సస్పెండ్‌ చేశారు. కాగా పది రోజుల కంటే ఎక్కువ తప్పుడు హాజరు వేసుకున్న 42 మందిపై అధికారులు చర్యలకు సిద్ధంకాగా, పది రోజులకంటే తక్కువ తప్పుడు హాజరు నమోదు చేసుకున్నవారు మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది.

నోటీసులకు వివరణ వచ్చాక..

ఇప్పటికే షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన 42 మంది కార్యదర్శుల నుంచి వివరణ కోసం జిల్లా అధికారులు ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు బాధ్యులను చేస్తూ 17 మంది ఎంపీఓలకు సైతం నోటీసులు ఇచ్చారు. నెలలో అత్యధికంగా ఫేక్‌ అటెండెన్స్‌ వేసిన కార్యదర్శులు, వారి పనితీరును పరిగణనలోకి తీసుకుని సస్పెన్షన్‌ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇతర జిల్లాలో మాదిరిగానే ఇక్కడ కూడా తప్పుడు హాజరు నమోదు చేసిన కార్యదర్శులపై వేటు తప్పదనే వాదనలు వినిపిస్తోంది. ప్రధానంగా జూలైలో హాజరును పరిగణనలోకి తీసుకుని అత్యధిక రోజులు ఫేక్‌ అటెండెన్స్‌ నమోదు చేసిన వారిపై చర్యలు ఉంటాయని తెలుస్తోంది.

ఆ ఆరుగురిపై కఠిన చర్యలు?

ప్రధానంగా నెలలో 20 రోజులకుపైగా ఫేక్‌ హాజరును నమోదు చేసినట్లు గర్తించిన సారపాక, భద్రాచలం, బూర్గంపాడు, లక్ష్మీపురం, తాళ్లగొమ్మూరు, తడికలపూడి వంటి మేజర్‌ పంచాయతీల కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ఇక నుంచి విధులకు హాజరవ్వకుండా తప్పుడు అటెండెన్స్‌ నమోదు చేసే పంచాయతీ కార్యదర్శులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ కలెక్టర్లకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. భారతీయ న్యాయ సంహిత, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫోర్జరీ, మోసపూరిత, సైబర్‌ మోసం చట్టం తదితర నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించింది. కార్యదర్శులపై పర్యవేక్షక బాధ్యతలు నిర్వర్తించే మండల, డివిజనల్‌, జిల్లా పంచాయతీ అధికారులు మోసాలను గుర్తించడంలో విఫలమైనా, నిర్లక్ష్యం వహించినా వారిపైనా క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌ సృజన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆరు పంచాయతీల్లో

20 రోజులకు పైగా తప్పుడు హాజరు

గత నెల అక్రమ హాజర్ల ఆధారంగా కార్యదర్శులపై వేటు?

కఠిన చర్యలకు సిద్ధమవుతున్న

ఉన్నతాధికారులు

జిల్లాలో 42 గ్రామపంచాయతీల్లో ఫేక్‌ అటెండెన్స్‌

ఫేక్‌ అటెండెన్స్‌ కార్యదర్శుల సంఖ్య

20 రోజులకుపైగా 6

16 నుంచి 20 రోజులు 10

10 నుంచి 15 రోజులు 26

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement