
భూ వివాదాలను న్యాయపరంగా పరిష్కరించుకోవాలి
ఇల్లెందురూరల్: గ్రామంలో భూ వివాదాలు ఉంటే న్యాయపరంగా పరిష్కరించుకోవాలే తప్ప స్థానికంగా పెద్దమనుషులు పంచాయతీ చేయడం చట్టవిరుద్ధమని డీఎస్పీ చంద్రభాను స్పష్టం చేశారు. కుల బహిష్కరణ ఆరోపణల నేపథ్యంలో ఆదివారం మండలంలోని పాతపూసపల్లి, కొత్తపూసపల్లి గ్రామాల్లో ఆయన గ్రామసభ నిర్వహించి విచారణ చేశారు.
రెండు గ్రామాల్లో గ్రామపెద్దలు, ఆరోపించిన కుటుంబాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దమనుషులను అంశాల వారీగా ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. రెండు కుటంబాల మధ్య చోటుచేసుకున్న భూ వివాదం మనస్పర్దలకు దారితీసి సమస్యాత్మకంగా మారిందని గుర్తించారు. ఈ విషయంలో పంచాయతీ నిర్వహించిన పెద్దలు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేసినప్పటికీ జఠిలంగా మారిందని తెలుసుకున్నారు. కుల బహిష్కరణ జరగలేదని నిర్ధారించుకున్న ఆయన భవిష్యత్‌లో ఇలాంటి ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా గ్రామపెద్దలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రస్తుతం నెలకొన్న భూవివాదాన్ని కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి, పాతపూసపల్లి, కొత్తపూసపల్లి గ్రామపెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.