
ప్రశాంత వాతావరణం కల్పించాలి
● పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మెలగాలి ● డీఈఓ వెంకటేశ్వరా చారి
పాల్వంచ: పిల్లలు చదువుకునేందుకు ఇళ్లలో ప్రశాంత వాతావరణం కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వరాచారి తల్లిదండ్రులకు సూచించారు. అంతేకాక పిల్లలతో స్నేహ పూర్వకంగా మెలగాలని అన్నారు. స్థానిక వికలాంగుల కాలనీ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలపై పిల్లలతో చర్చించాలని, హోం, క్లాస్ వర్క్ పూర్తి చేయించాలని కోరారు. పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలన్నారు. పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ అమలు చేయాలని, డిజిటల్ పాఠాల కోసం ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు వినియోగించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి ఎస్‌కే.సైదులు, ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
15న జిల్లా స్థాయి కామిక్ రచన పోటీలు..
కొత్తగూడెంఅర్బన్: ఈనెల 15న జిల్లా స్థాయి ‘కామిక్ రచన’ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ వెంకటేశ్వరాచారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీల్లో చదివే 6 నుంచి 10వ తరగతి వరకు గల విద్యార్థులు పాల్గొనవచ్చని సూచించారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని, ప్రతీ పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు మాత్రమే పాల్గొనాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు బహుమతులు ఉంటాయని, ప్రథమ స్థానం సాధించిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని వివరించారు. ఈ మేరకు విద్యార్థులను ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వివరాలకు జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్‌ను సంప్రదించాలని తెలిపారు.