కస్తూర్బాల్లో పుస్తకాల్లేవ్‌ ! | - | Sakshi
Sakshi News home page

కస్తూర్బాల్లో పుస్తకాల్లేవ్‌ !

Jul 8 2025 5:02 AM | Updated on Jul 8 2025 5:02 AM

కస్తూ

కస్తూర్బాల్లో పుస్తకాల్లేవ్‌ !

● ఇంటర్‌ విద్యార్థులకు నేటికీ అందని వైనం ● పాత పుస్తకాలతోనే నెట్టుకొస్తున్న బాలికలు ● విద్యాశాఖ నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు

కరకగూడెం: గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల బాలికలకు విద్యనందించడంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ) కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్‌ వరకు బోధన సాగుతోంది. ఇంటర్‌ బోర్డు నిర్దేశించిన సిలబస్‌ను అనుసరించి తెలుగు అకాడమీ, స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ద్వారా ప్రచురితమైన పుస్తకాలను ఇక్కడ బోధిస్తుండగా ఇవి ఇంగ్లిష్‌ మీడియంలో ఉంటాయి. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా ఇంటర్‌ విద్యార్థినులకు ఇప్పటికీ కొత్త పాఠ్యపుస్తకాలు అందలేదు. దీంతో పాత పుస్తకాలతో చదువు కొనసాగిస్తున్నారు. జిల్లాలో పాల్వంచ, టేకులపల్లి, బూర్గంపాడు, గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం, ములకలపల్లి, చండ్రుగొండ, భద్రాచలం, దుమ్ముగూడెం, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు, చర్ల, పినపాక మండలాల్లో మొత్తం 14 కేజీబీవీలు ఉండగా 1,310 మంది ఇంటర్‌ విద్యనభ్యసిస్తున్నారు.

పేద విద్యార్థినులపై నిర్లక్ష్యమా..

విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా కేజీబీవీల్లో ఇంటర్‌ పుస్తకాలు సరఫరా చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ప్రణాళిక, సమన్వయ లోపంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు. కస్తూర్బా విద్యాలయాల్లో నిరుపేద విద్యార్థినులే ఎక్కువగా చేరుతుంటారని, వారి భవిష్యత్‌తో ప్రభుత్వం ఆడుకోవద్దని కోరుతున్నారు.

త్వరలోనే అందజేస్తాం..

కస్తూర్బా విద్యార్థినిలకు పుస్తకాల సరఫరాలో జాప్యం జరి గింది నిజమే. సాంకేతిక కారణాలు, ప్రింటింగ్‌ ప్రక్రియలో ఆలస్యమైంది. సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. త్వరలోనే అన్ని కస్తూర్బా విద్యాలయాలకు పుస్తకాలను అందజేస్తాం. ప్రస్తుతం వారి అభ్యసనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తున్నాం. – అన్నామణి, జీసీడీఓ

పుస్తకాలు లేక అర్థం కావడం లేదు

పుస్తకాలు లేకపోవడంతో లెక్చరర్లు చెప్పే పాఠాలు సరిగా అర్థం కావడం లేదు. పాఠం చెప్పాక తిరిగి చదువుకోవడానికి, నోట్స్‌ రాసుకోవడానికి కష్టంగా ఉంది. పాత పుస్తకాలు ఇచ్చినా ఇబ్బందులు తప్పడం లేదు. త్వరగా కొత్త పుస్తకాలు ఇవ్వాలి.

– ఎం.లావణ్య, ఇంటర్‌ ఫస్టియర్‌,

కేజీబీవీ భట్టుపల్లి

అభ్యసనంపై ప్రభావం..

కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్‌ విద్యార్థినులకు పుస్తకాలు అందకపోవడంతో అభ్యసనంపై తీవ్ర ప్రభావం పడుతోంది. పాఠాలను అర్థం చేసుకోవడం, నోట్స్‌ రాసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అధ్యాపకులు చెప్పిన పాఠాలు వినడం తప్ప వాటిని తిరిగి సాధన చేయలేకపోతున్నామని బాలికలు అంటున్నారు. కొత్త పుస్తకాలు రాకపోవడంతో గతేడాది చదివిన విద్యార్థినుల పాత పుస్తకాలపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. తమ పిల్లలకు పుస్తకాలు కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేదని, ప్రభుత్వమే త్వరగా పుస్తకాలు పంపిణీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

కస్తూర్బాల్లో పుస్తకాల్లేవ్‌ !1
1/2

కస్తూర్బాల్లో పుస్తకాల్లేవ్‌ !

కస్తూర్బాల్లో పుస్తకాల్లేవ్‌ !2
2/2

కస్తూర్బాల్లో పుస్తకాల్లేవ్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement