ఎస్‌హెచ్‌జీలకు అండగా..
● బాధిత కుటుంబాలకు పరిహారం అందించనున్న ప్రభుత్వం ● సభ్యులు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.10 లక్షలు పరిహారం ● ఉమ్మడి జిల్లాలో 43,521 స్వయం సహాయక సంఘాలు
చుంచుపల్లి: మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం పాటుపడుతోంది. బ్యాంకు లింకేజీ రుణాలు, సీ్త్రనిధి రుణాలు అందిస్తోంది. మహిళాశక్తి పేరుతో ప్రత్యేక రుణాలను అందించడంతోపాటు చిరు వ్యాపారాలను కూడా ప్రోత్సహిస్తోంది. తాజాగా రూ.10 లక్షల వరకు ప్రమాద పరిహారం వర్తింపజేసేలా రాష్ట్ర మంత్రి మండలి ఇటీవల నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తు ఎస్‌హెచ్‌జీ సభ్యులు మృతి చెందితే బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించనుంది. ప్రమాద బీమాను 2024 మార్చి 14 నుంచి వర్తింపజేయనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రమాదవశాత్తు మృతిచెందిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మృతి చెందిన సభ్యులు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకపోయి ఉంటే ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల్లో రుణ బకాయిలు మినహాయించుకుని మిగతా పరిహారం బాధిత కుటుంబాలకు అందజేస్తారు. సహజ మరణం పొందిన సభ్యులకు మాత్రం రూ.2 లక్షల లోపు రుణ బకాయిలు ఉంటే డబ్బులను ప్రభుత్వమే చెల్లించి వారి రుణ ఖాతాలను మూసివేయనుంది.
ఉమ్మడి జిల్లాలో 43,521 ఎస్‌హెచ్‌జీలు
గతంలోనూ సభ్యులు కొంత మేర ప్రీమియం చెల్లిస్తే మిగతాది ప్రభుత్వం జోడించి బీమా సౌకర్యాన్ని కల్పించేది. ప్రస్తుతం మహిళా సంఘాలకు ప్రభుత్వమే నేరుగా ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించడంతో బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు అందనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 42 మండలాల్లో 43,521 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 4,54,313 మంది మహిళలు సభ్యులు కొనసాగుతున్నారు. వీరికి ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే రుణ, ప్రమాద బీమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రమాదంలో సభ్యురాలు మృతి చెందినా, వంద శాతం వైకల్యం కలిగినా రూ.10 లక్షలు అందిస్తారు. 50 శాతం వైకల్యం కలిగితే రూ.5 లక్షలు చెల్లిస్తారు. మృతిచెందిన మహిళలకు పొదుపు అప్పు ఉంటే అది కూడా పూర్తిగా మాఫీ చేస్తారు. ఇందుకు గాయాలైన మహిళ అంగవైకల్యం తెలుపుతూ సదరం ధ్రువపత్రాలు, చికిత్స పొందిన ఆస్పత్రి పత్రాలు, పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. బీమా సౌకర్యం 18 నుంచి 60 ఏళ్ల వయసున్న సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటివరకు రుణం పొందిన మహిళల్లో ఎవరైనా మరణిస్తే వడ్డీతో కలిపి ఆమె కుటుంబ సభ్యులు చెల్లించాల్సి వచ్చేది. ఇక నుంచి చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేయనుంది.
ఎంతో ప్రయోజనం
రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లో సభ్యులకు కల్పించిన ప్రమాద బీమా సౌకర్యంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కలగనుంది. ప్రమాదంలో మృతి చెందితే కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల పరిహారం వర్తిస్తుంది. దీనిపై మహిళా సంఘాలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
–ఎం.విద్యాచందన, డీఆర్‌డీఓ
ఉమ్మడి జిల్లాలో ఎస్‌హెచ్‌జీల వివరాలు
ఖమ్మం భద్రాద్రి
మండలాలు 20 22
వీఓలు 1,017 981
ఎస్‌హెచ్‌జీలు 25,106 18,415
సభ్యులు 2,72,701 1,81,612
ఎస్‌హెచ్‌జీలకు అండగా..


