మూడు రోజుల్లో కుమార్తె పెళ్లి
ఇల్లెందురూరల్: మూడు రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి జరగనుండగా.. కుటుంబ సభ్యులంతా నూతన రంగులతో ముస్తాబు చేసుకున్నారు. శుభలేఖలు బంధువులకు ఇచ్చి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో పెళ్లికూతురి తండ్రి మృతిచెందాడు. దీంతో ఆ ఇంట్లో ఊహించని విషాదం అలుముకుంది. పట్టణంలోని 24 ఏరియాకు చెందిన పిల్లి శ్రీనివాస్ అలియాస్ ఏసుదాస్ (60) సింగరేణి గెస్ట్‌హౌస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు నలుగురు కుమార్తెలుండగా.. ఇద్దరి వివాహాలు అయ్యాయి. ఈ నెల 30న తన ఉద్యోగ విరమణ ఉండటంతో ఆలోపు మూడో కుమార్తె సునీత పెళ్లి చేయాలని నిర్ణయించారు. గోదావరిఖని వాసి ప్రసాద్‌తో సంబంధం కుదిర్చి.. ఈ నెల 16వ తేదీన పెళ్లి పెట్టుకున్నారు. శ్రీనివాస్ బంధువులకు శుభలేఖలు పంపిణీ చేసేందుకు శుక్రవారం మండలంలోని కొమరారం వెళ్లి.. తిరిగి వస్తున్నాడు. మామిడిగూడెం సమీపంలో ఎదురుగా వచ్చిన కోతులను తప్పించబోయి నేరుగా చెట్టును ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శ్రీనివాస్ మృతదేహాన్ని ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది.
రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి


