ఊపందుకోని సాగు
● వర్షాభావ పరిస్థితులతో ముమ్మరంకాని వ్యవసాయ పనులు ● జిల్లాలో ఇప్పటివరకు 27,620 ఎకరాల్లోనే పంటల సాగు ● వానాకాలంలో సాధారణ సాగు విస్తీర్ణం 6,03,124 ఎకరాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): వానాకాలం సీజన్‌లో రైతులు పంటల సాగు మొదలుపెట్టినా ఇంకా ఊపందుకోలేదు. తొలకరి పలకరించినా వర్షాభావ పరిస్థితులతో ఒకింత ఆందోళన చెందుతున్నారు. నీటి వనరులు ఉన్న చోట సాగుకు సమాయత్తమవుతున్నారు. వర్షాధార ప్రాంతాల్లో అన్నదాతలు ఆకాశంకేసీ చూస్తున్నారు. జిల్లాలోని 23 మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం 21,016 ఎకరాల్లో పత్తి సాగు చేపట్టారు. అధికంగా టేకులపల్లి మండలంలో 8,036 ఎకరాలు, అశ్వాపురం మండలంలో 1,980 ఎకరాలు, బూర్గంపాడు మండలంలో 7,250 ఎకరాలు, సుజాతనగర్ మండలంలో 845 ఎకరాల్లో పత్తి విత్తారు. మొక్క జొన్న 69 ఎకరాలు, పెసర 22 ఎకరాలు, పచ్చిరొట్ట ఎరువు కోసం ఉపయోగించే జీలుగు 3,087 ఎకరాలు, జనుము 152 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మొత్తం 27,620 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వానాకాలంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు 6,03,124 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. పూర్తిస్థాయిలో వర్షాలు లేకపోవడంతో కేవలం 27,620 ఎకరాల్లోనే రైతులు సాగు పనులు చేపట్టారు. రాబోయే రోజులో వర్షాలు పెరిగితే ముమ్మరంగా వ్యవసాయ పనులు చేపట్టనున్నారు.
10 మండలాల్లో వర్షాభావం..
జిల్లాలో 10 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కరకగూడెం, పినపాక, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు, ఆళ్లపల్లి, గుండాల, ఇల్లెందు, భద్రాచలం, ములకలపల్లి మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, బూర్గంపాడు, అశ్వారావుపేట, లక్ష్మీదేవిపల్లి మండలాలలో సాధారణ వర్షపాతం నమోదైంది. చర్ల, టేకులపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, సుజాతనగర్, కొత్తగూడెం, పాల్వంచ, దమ్మపేట మండలాలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 37.9 మి.మీ సరాసరి వర్షపాతం నమోదైంది.


