గంగానమ్మ ఆలయంలో చోరీ
అశ్వారావుపేటరూరల్: మండలంలోని గుమ్మడవల్లి సమీపంలో ఉన్న పెదవాగు ప్రాజెక్టు వద్దగల శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంలో గురువారం తెల్లవారుజాము న చోరీ జరిగింది. ఆలయం తలుపు తెరిచి లోపల ఉన్న రెండు హుండీలను ధ్వంసం చేసి సుమారు రూ.50 వేలు అపహరించినట్లు ఆలయ కమిటీ బాధ్యులు తెలి పారు. పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై యయాతిరాజు దర్యాప్తు చేపట్టారు.
117 మందికి జరిమానా
సూపర్‌బజార్(కొత్తగూడెం): మద్యం తాగి వాహనాలు నడిపిన కేసుల్లో 117 మందికి జరిమానా విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు గురువారం తీర్పు చెప్పారు. కొత్తగూడెం వన్‌టౌన్ పరిధిలో 24 మంది, ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో 13మంది, కొత్తగూడెం టూటౌన్ పరిధిలో 30 మంది, సుజాతనగర్ పరిధిలో 10మంది, చండ్రుగొండ పరిధిలో 10మంది, ములకలపల్లి స్టేషన్ పరిధిలో 30మంది మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి జరిమానా విధించారు.
ప్రాణం తీసిన పాల డబ్బుల గొడవ
అశ్వారావుపేటరూరల్: పాలు పోసిన డబ్బుల విషయంలో జరిగిన గొడవ ఓ మహిళ ప్రాణాలు తీసింది. ఈ సంఘటన గురువారం జరిగింది. ఎస్సై యయాతిరాజు కథనం ప్రకారం.. పట్టణంలోని నందమూరినగర్ కాలనీకి చెందిన గొల్ల సత్యవతి అదే కాలనీకి చెందిన షేక్ సమీరాను పాలు పోసిన డబ్బులు ఇవ్వాలని అడిగింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. అదే సమయంలో ఇంట్లో ఉన్న సమీరా బంధువు మౌలాబీ రావడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. గమనించిన గొడవను ఆపేందుకు వెళ్లిన సత్యవతి తల్లి గుండుబోయిన మంగ(40)ను కూడా నెట్టివేశారు. ఒక్కసారిగా కింద పడిపోయిన మంగ కొద్ది సేపట్లోనే తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారస్థితిలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలిచగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుకు గురై మృతి చెందిందనితెలిపారు. మృతురాలి కుమార్తె సత్యవతి ఫిర్యాదుతో మృతికి కారణమైన షేక్ సమీరా, మౌలాబీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
కార్మిక సమస్యలపై బీఎంఎస్ ఆందోళన
సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు పరిశ్రమల అభివృద్ధి, కార్మిక సమస్యల పరిష్కారానికి ఏబీకేఎంఎస్ అనుబంధ బీఎంఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆ సంఘం కార్యదర్శి పి. మాధవనాయక్ తెలిపారు. ఇటీవల బిలాస్‌పూర్‌లో జరిగిన యూనియన్ పదాధికారుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గురువారం ఆయన వివరించారు. సింగరేణిలో ఉత్పత్తి పేరుతో కాంట్రాక్ట్‌ల ఆధారిత విధానం విపరీతంగా పెరిగిందని, కార్మికుల భవిష్యత్‌కు హానికరమని పేర్కొన్నారు. జూలై 1 నుంచి 10వ తేదీ వరకు పిట్ మీటింగ్‌లు, గేట్ మీటింగ్‌లు నిర్వహించి కార్మికులకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. 14న జీఎం కార్యాయాల దుట ధర్నాలు, 15 నుంచి 25 వరకు జనసంపర్క అభియాన్ కార్యక్రమాలు, ఆగస్ట్ 1 నుంచి 10వ తేదీ వరకు పబ్లిక్ మీటింగ్‌లు, మీడియా సమావేశాల ద్వారా ప్రజలలో చైతన్యం కల్గించే కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.


