‘అంగన్‌బడి’కి అడుగులు
● అడ్మిషన్ల ప్రక్రియ షురూ.. ● ప్రారంభమైన అమ్మ మాట – అంగన్‌వాడీ బాట ● రెండున్నరేళ్లు పైబడిన చిన్నారులను చేర్చడమే లక్ష్యం ● ఈనెల 17 వరకు ప్రత్యేక కార్యక్రమాలు
భద్రాచలంఅర్బన్ : చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య ఎంతో కీలకం. వారు పాఠశాలల్లో చేరే నాటికి అక్షరాలు, అంకెలు నేర్పి ఆటపాటలతో కూడిన విద్య అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. మంగళవారం నుంచి ఈనెల 17 వరకు ‘అమ్మమాట – అంగన్‌వాడీ బాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 30 నెలలు దాటిన చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో 17వ తేదీన సామూహిక అక్షరాభ్యాసాలు చేయించనున్నారు.
మానసిక ఒత్తిడికి లోనుకాకుండా..
ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలకు దీటుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తున్నారు. పిల్లలపై మానసిక ఒత్తిడి పడకుండా ఆటలు, పాటలు, కథల ద్వారా చదువుపై ఆసక్తి పెంచుతున్నారు. వారిని ఆకట్టుకునేలా సిలబస్ రూపొందించారు. అంగన్‌వాడీ సెంటర్లలో చిన్నారులకు గతేడాది నుంచి ప్రభుత్వం యూనిఫామ్ కూడా అందిస్తున్న విషయం తెలిసిందే.
బడిబాట పట్టేలా..
జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,061 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 7 నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలు 30,654 మంది, 3 – 6 ఏళ్ల మధ్య వారు 26,635 మంది ఉన్నారు. వీరితో పాటు 6,429 మంది గర్భిణులు, 5,825 మంది బాలింతలు ఉన్నారు. ఐదేళ్లు నిండిన వారిని పాఠశాలల్లో చేర్చిస్తే ఈ సెంటర్లలో చిన్నారుల సంఖ్య తగ్గుతుంది. దీంతో మూడేళ్లు దాటిన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సెంటర్లలో చిన్నారులకు భోజనం, గుడ్డు, మురుకులు అందజేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్వ ప్రాథమిక విద్య బోధిస్తున్నారు. మూడు నుంచి ఆరేళ్ల చిన్నారులను బడిబాట పట్టించేందుకు సిద్ధం చేస్తున్నారు. గతంలో అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లుగా భావించే వారు. పిల్లలకు పాఠశాల వాతావరణం అలవాటు చేయడంతో పాటు పౌష్టికాహారం అందించి, ఆటలు ఆడించి, బడి అంటే భయం పోగొట్టే కేంద్రాలు అనుకునేవారు. అయితే గతేడాది నుంచి పౌష్టికాహారం, ఆటపాటలతో పాటు చిన్నారులకు విజ్ఞానం అందించేందుకు వర్క్‌బుక్‌లు ఇస్తూ హోం వర్క్ చేయిస్తున్నారు. ఎల్‌కేజీ వారికి తంగేడు పువ్వు పేరుతో నాలుగు పుస్తకాలు, యూకేజీ వారికి పాలపిట్ట పేరిట ఐదు పుస్తకాలు బోధిస్తున్నారు. ప్రస్తుతం నిపుణ్ బారత్ ద్వారా వచ్చిన ప్రియదర్శిని పుస్తకంతో సులభ పద్ధతుల్లో విద్యా బోధన చేస్తున్నారు.
17 వరకు కార్యక్రమాలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 17 వరకు ‘అమ్మ మాట – అంగన్‌వాడీ బాట’ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు అలవాటు చేసి ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్య అందించడమే కార్యక్రమ లక్ష్యం. విజయవంతానికి ప్రతీ అంగన్‌వాడీ టీచర్, ఆయా కృషి చేయాలి.
– జ్యోతి, సీడీపీఓ, దుమ్ముగూడెం ప్రాజెక్ట్
చిన్నారులను చేర్పించేలా..
జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడేళ్లు దాటిన చిన్నారులను చేర్చించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఐదేళ్లు దాటిన చిన్నారులను దగ్గరలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించడంతో పాటు వారికి అందించే పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది.
– స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమాధికారి
భద్రాచలంలో అమ్మమాట – అంగన్‌వాడీ బాట కార్యక్రమంలో ఉద్యోగులు
ఖాళీలతో సతమతం
జిల్లాలో 2,061 అంగన్‌వాడీ కేంద్రాలకు గాను ప్రస్తుతం 192 టీచర్, 961 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పక్క కేంద్రాలకు చెందిన టీచర్లు, ఆయాలతోనే నిర్వహిస్తుండగా రెండు కేంద్రాల పర్యవేక్షణ వారికి భారంగా మారుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. ఖాళీలను కూడా భర్తీ చేస్తే చిన్నారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు.
‘అంగన్‌బడి’కి అడుగులు
‘అంగన్‌బడి’కి అడుగులు


