కలవరపెడుతున్న గ్యాంగ్‌వార్‌ | - | Sakshi
Sakshi News home page

కలవరపెడుతున్న గ్యాంగ్‌వార్‌

Jun 9 2025 7:05 AM | Updated on Jun 9 2025 7:05 AM

కలవరపెడుతున్న గ్యాంగ్‌వార్‌

కలవరపెడుతున్న గ్యాంగ్‌వార్‌

భద్రాచలం: ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న భద్రాచలం ఆధ్యాత్మిక క్షేత్రంలో హత్యలు జరుగుతున్నాయి. పర్యాటకులకు, భక్తులకు మరుపురాని అనుభూతులను అందించే భద్రగిరిలో ఇటీవలి కాలంలో యువతలో హింసాప్రవృత్తి నానాటికీ పెరిగిపోతోంది. మత్తు పదార్థాలు, మద్యానికి బానిసలవుతున్న యువత.. హింస, గొడవలను ఫ్యాషన్‌గా భావిస్తూ హత్యలకు సైతం తెగబడుతున్నారు. కట్టడి చేయాల్సిన రక్షణ శాఖ విఫలమవ్వటంతో పాటుగా అవినీతి ఆరోపణలతో కూరుకుపోతోంది.

పెరుగుతున్న గొడవలు..

జిల్లాలో ఇండస్ట్రియల్‌ ఏరియాలు, కొన్ని ప్రాంతాలకే పరిమితమైన గ్యాంగ్‌వార్‌ల విష సంస్కృతి భద్రాచలానికి పాకింది. గతంలో కేవలం గొడవలకే పరిమితమైన ఈ వార్‌లు ప్రస్తుతం హత్యలకు సైతం దారి తీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది హోలీ రోజున భద్రాచలానికి చెందిన యువకుడిని ఏపీలోని వెంకటరెడ్డిపేటలో మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేశారు. రెండు రోజుల కిందట పట్టణంలోని జగదీశ్‌కాలనీకి చెందిన సతీశ్‌ ను చంపారు. ఇంట్లో ఉండగానే, కుటుంబ సభ్యు లు అడ్డుకుంటున్నా అందరి ముందే హత్య చేయటం యువకుల్లో పెరుగుతున్న హింసాప్రవృత్తికి నిదర్శనం.

ఫ్యాషన్‌గా మారుతున్న క్రైం

సినిమాలు, టీవీలు, ఓటీటీ కంటెంట్‌లో చూపిస్తున్న మత్తు పదార్థాలు, మద్యం వాడకం యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. హింస కంటెంట్‌గా వస్తున్న సినిమాలతో పాటుగా యువతలో నానాటికీ లోపిస్తున్న మానవతా విలువలు ఇలాంటి ఘటనలకు దారితీస్తున్నట్లు సమాచారం. విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, బెల్ట్‌షాపుల్లో నిరంతరం లభిస్తున్న మద్యంతో యువత చెడుమార్గం పడుతుండగా.. కొందరు ప్రముఖుల, రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఈ గ్యాంగ్‌లను పోషిస్తున్నారనే అపవాదు సైతం ఉంది. వీరి అండదండలు, ప్రోత్సాహంతో యువత సైతం తల్లిదండ్రుల లక్ష్యాలను, భవిష్యత్‌ను పక్కకు పెట్టి హింసవైపు పరుగులు తీస్తున్నారు.

పోలీస్‌ శాఖ విఫలం..

భద్రాచలంలో పెట్రేగిపోతున్న హింస, గొడవలను అరికట్టడంలో పోలీస్‌ శాఖ విఫలమవుతోందనే ఆరోపణలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. గంజాయి అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రంగా ఉన్న భద్రాచలంలో వీటిపై మాత్రమే దృష్టి సారించిన రక్షణ శాఖ పెరుగుతున్న గంజాయి వాడకం, గొడవలను అరికట్టడంలో వెనుకబడ్డారని విమర్శలు వస్తున్నాయి. అవినీతి సొమ్ముకు ఆశపడిఏడాది కాలంలోనే భద్రాచలంపోలీస్‌శాఖలో ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులుపట్టుబడటం సైతం పోలీసులపై ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తోంది. ఇసుక, మైనింగ్‌ మాఫియాకు అండగా ఉంటూ ప్రధాన కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్‌ అధికారులు పెట్రోలింగ్‌ను పెంచి, గొడవలకు దిగుతున్న యువకులకు కౌన్సెలింగ్‌ ఇస్తూ చెడు వ్యవసనాలకు బానిసకాకుండా పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న

హింసాప్రవృత్తి

హత్యలను ఫ్యాషన్‌గా భావిస్తున్న యువత

కట్టడి చేయటంలో పోలీస్‌ శాఖ విఫలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement