విశ్వాసానికి ప్రతీక బక్రీద్
ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో బక్రీద్ ఒకటి. ఇది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ నెలలోని జుల్ హజ్ మాసంలో పదో రోజున వస్తుంది. త్యాగానికి, భక్తికి, దానధర్మాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ... అల్లాహ్ పట్ల ప్రవక్త ఇబ్రహీం చూపిన అంకితభావాన్ని, విశ్వాసాన్ని గుర్తు చేస్తుంది. నేడు జిల్లా వ్యాప్తంగా ముస్లింలు పవిత్ర బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలకు విద్యుత్ దీపాలతో అలంకరించి సిద్ధం చేశారు.
కరకగూడెం/జూలూరుపాడు: బక్రీద్ పండుగ మూలం ఖురాన్ మరియు ఇస్లాం సంప్రదాయాలలో ప్రవక్త ఇబ్రహీం కథతో ముడిపడి ఉంది. దేవుడు ఇబ్రహీం విశ్వాసాన్ని పరీక్షించడానికి తన కుమారుడు ఇస్మాయిల్‌ను బలిదానం చేయమని ఆదేశిస్తాడు. దేవుని ఆజ్ఞకు పాటించేందుకు సిద్ధపడ్డాడు ఇబ్రహీం. అయితే అతని త్యాగ, విధేయతను చూసిన దేవుడు.. ఇస్మాయిల్ స్థానంలో ఒక గొర్రెను బలిదానం చేయమని ఆదేశించాడు. ఈ సంఘటన దేవుని పట్ల అపరిమితమైన విశ్వాసం, విధేయత, త్యాగ భావనను సూచిస్తుంది బక్రీద్ పండుగ. దీనిని జ్ఞాపకం చేసుకుంటూ ముస్లింలు తమ విశ్వాసాన్ని దేవుని పట్ల భక్తిని చాటే అవకాశం అందిస్తుంది. ఈ పండుగ సామాజిక సమానత్వం, సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో బలిదానం చేసిన జంతుమాంసాన్ని మూడు భాగాలుగా విభజించి కుటుంబం, బంధువులు, పేదవారికి పంచుతారు.
హజ్ యాత్రతో పాపాల విముక్తి..
హజ్ యాత్ర ఇస్లాం యొక్క ఐదు స్తంభాలలో ఒకటి మరియు బక్రీద్ పండుగతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. ప్రతీ ముస్లిం తన జీవితంలో కనీసం ఒక్కసారైనా చేయవలసిన పవిత్ర యాత్ర. హజ్ యాత్ర మక్కా నగరంలోని కాబా ఆలయం చుట్టూ జరుగుతుంది. ఇది ఇస్లామీయా సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన స్థలం. ఈ యాత్రలో పలు ఆచారాలు ఉన్నాయి, కాబా చుట్టూ తవాఫ్ (ప్రదక్షిణ), సఫా మరియు మర్వా కొండల మధ్య సాయి (నడక), అరాఫాత్ రోజున ప్రార్థనలు మరియు మినా వద్ద రాళ్లు రువ్వడం వంటివి ఉన్నాయి. ఈ ఆచారాలు ఇబ్రహీం, అతని భార్య హాజర్ మరియు వారి కుమారుడు ఇస్మాయిల్ జీవితంలోని సంఘటనలను స్మరించుకునేలా రూపొందించబడ్డాయి. ఈ యాత్ర పూర్తి చేసినవారు తన పాపాల నుంచి విముక్తి పొంది, ఆధ్యాత్మికంగా శుద్ధి అవుతారని ముస్లింల నమ్మకం. హజ్ యాత్ర సమయంలో అందరూ ఒకే రకమైన దుస్తులు (ఇహ్రామ్) ధరిస్తారు. ఇది సామాజిక తేడాలను తొలగించి, అందరినీ దేవుని ముందు సమానులుగా చూపిస్తుంది.
త్యాగానికి పరమార్థం ఖుర్బానీ..
ఖుర్బానీ ఇబ్రహీం త్యాగ భావనను స్మరించే ఆచా రం. ఈ సందర్భంగా ముస్లింలు గొర్రె, మేక, ఆవు లేదా ఒంటె జంతువును బలిదానం చేస్తారు. మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి కుటుంబం, బంధువులు, పేదవారికి పంచుతారు. దీని పరమార్థం కేవలం జంతు బలిదానం మాత్రమే కాదు.. స్వార్థ ఆలోచనలను త్యజించి, సమాజంలోని నిరుపేదలు మరియు అవసరమైన వారి పట్ల దాతృత్వాన్ని ప్రోత్సహిస్తుంది.
నేడు ముస్లింల పవిత్ర పండుగ
హజ్ యాత్ర, ఖుర్బానీకి పరమార్థం
జిల్లాలో ముస్తాబైన మసీదులు,
ఈద్గాలు
విశ్వాసానికి ప్రతీక..
బక్రీద్ పండుగ కేవలం జంతు బలి గురించి కాదు. ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధపడటం ద్వారా అల్లాహ్ పట్ల ఆయనకున్న అపారమైన విధేయతను చాటుకున్నారు. ఆ త్యాగ స్ఫూర్తిని గుర్తుచేసుకోవడమే విశ్వాసారికి ప్రతీక. ఖుర్బానీ ద్వారా అహంకారం, దురాశ, స్వార్థాన్ని వదిలేయాలి.
– మొహమ్మద్ ఫిరోజ్, కరకగూడెం
దానధర్మాలను నేర్పుతుంది..
బక్రీద్ అంటే సెలవు దినం కాదు. ఇది మా కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపే సమయం. పెద్దలు చెప్పే కథలు వినడం, కొత్త బట్టలు వేసుకోవడం, నమాజ్, పేదలకు సాయం చేయడం వంటివి చేయాలి. ఖుర్బానీ మాంసాన్ని పేదలకు పంచేటప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిది. ఇది దానధర్మాలను నేర్పుతుంది.
– మొహమ్మద్ సద్దాం, పాల్వంచ
విశ్వాసానికి ప్రతీక బక్రీద్
విశ్వాసానికి ప్రతీక బక్రీద్


