గ్లోబల్‌ కంపెనీగా.. | - | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ కంపెనీగా..

Dec 22 2025 2:05 AM | Updated on Dec 22 2025 2:05 AM

గ్లోబల్‌ కంపెనీగా..

గ్లోబల్‌ కంపెనీగా..

విద్యుత్‌ రంగంలో ఇప్పటికే సింగరేణి బలమైన ముద్ర గ్రాఫైట్‌, బంగారం, రాగి గనులపైనా దృష్టి రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌లో సానుకూల ఫలితాలు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ట్రిపుల్‌ ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీ దిశగా తెలంగాణ సర్కారు అడుగులు వేస్తోంది. అందులో తన వంతు భాగస్వామ్యం కోసం సింగరేణి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఇవి ఎంతవరకు అమలవుతాయనే చర్చ జరుగుతోంది. సింగరేణి సంస్థ వందల ఏళ్లుగా బొగ్గు ఉత్పత్తికే పరిమితమైంది. తెలంగాణ ఏర్పడ్డాక సింగరేణి సీఎండీగా ఎన్‌.శ్రీధర్‌ ఉన్న సమయాన తొలిసారి థర్మల్‌ విద్యుత్‌ రంగంలోకి సంస్థ అడుగు పెట్టింది. ఆ వెంటనే సోలార్‌ పవర్‌పైనా దృష్టి సారించగా, నెట్‌జీరో సంస్థగా రేపోమాపో గుర్తింపు పొందనుంది. ఆపై కేంద్రంలో ఐఆర్‌ఎస్‌ సర్వీసులో ఉండి డిప్యూటేషన్‌పై తెలంగాణకు వచ్చి శ్రీధర్‌ తర్వాత సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఎన్‌.బలరాం సింగరేణి విస్తరణను మరింత వేగవంతం చేశారు. విద్యుత్‌ రంగంలో పంప్డ్‌ స్టోరేజీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ పథకాలను పట్టాలెక్కించారు. సంస్థ కార్యకలాపాలను తెలంగాణలోనే కాకుండా ఒడిశా, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలకు విస్తరించారు. అక్కడితో ఆగకుండా ఘనా, ఆస్ట్రేలియా వంటి దేశాలతోనూ వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు. బొగ్గుతోపాటు రాగి, బంగారం మైనింగ్‌ కోసం హక్కులు దక్కించుకున్నారు. ఎన్నాళ్ల నుంచో పీటముడి పడిన బొగ్గు బ్లాక్‌ల వేలం విషయంలో మౌనం వీడి బహిరంగ వేలానికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేలా కృషి చేశారు. బొగ్గు గనులు విస్తరించిన ప్రాంతంలో రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ ఉన్నట్టు గుర్తించి వాటి అన్వేషణ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

సంధి దశలో

ఒడిశాలో దక్కించుకున్న నైనీ బ్లాకు సింగరేణికి కీలకం కానుంది. ఈ మైన్‌ను ఆధారంగా చేసుకుని ఒడిశాలో 2,400 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌, 1,000 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌, 500 మెగావాట్ల ఫ్లోటెడ్‌ సోలార్‌ ప్లాంట్‌, 500 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్లాంట్ల నిర్మాణానికి ఒడిశా సర్కారు సిద్ధమైంది. సింగరేణి – ఒడిశా సర్కార్‌ నడుమ ఈనెల 18న అవగాహన ఒప్పందం కుదిరింది. సింగరేణి ఆధ్వర్యంలో రాజస్థాన్‌ ఎడారుల్లో రూ. 15,600 కోట్ల వ్యయంతో 4,000 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్ల స్థాపనకు ఆ రాష్ట్ర కేబినెట్‌ అంగీకారం తెలిపింది. ఆపై కర్ణాటకలో కాపర్‌, గోల్డ్‌ మైనింగ్‌కు లీజులు దక్కాయి. ఇవి కాకుండా గ్రాఫైట్‌ మైనింగ్‌కు సంబంధించి అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒక బ్లాక్‌ లీజ్‌ వచ్చింది.

కీలకమైన ప్రాజెక్టులు

కీలకమైన రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ విషయంలో ప్రాథమిక దశను ఇప్పటికే సింగరేణి దాటింది. గోదావరి–ప్రాణహిత లోయలో రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌(అరుదైన మూలకాల) విషయంలో సీఎస్‌ఐఆర్‌, ఐఎంఎటీ(భువనేశ్వర్‌), జేఎన్‌ఆర్‌ఏడీడీసీ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది. గోదావరి లోయలో నియోబియం, ట్రాన్సియంలను వెలికి తీయవచ్చని నివేదిక వచ్చింది. రేపోమాపో పనులు ప్రారంభించే అవకాశముంది. రేర్‌ ఎర్త్‌ విషయంలో సింగరేణి అనుసరించిన మోడల్‌ను తమకు వర్తింపజేయాలని ఇప్పటికే అసోం ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దేశవ్యాప్తంగా రేర్‌ ఎర్త్‌ మైనింగ్‌లో సింగరేణి కీలకంగా మారింది. ఇవి కాకుండా ఆఫ్రికాలోని ఘనా దేశంలో క్రిటికల్‌ మినరల్స్‌ మైనింగ్‌ విషయంలో అక్కడి ప్రభుత్వంతో సింగరేణి ఎంఓయూ చేసుకుంది. స్ట్రాటెజిక్‌ మినరల్స్‌ మైనింగ్‌ విషయంలో ఆస్ట్రేలియా, చిలీ, బ్రెజిల్‌, అర్జెంటీనా దేశాల్లో కార్యకలపాలు మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

కొత్త కంపెనీలు

భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల సింగరేణి గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌, సింగరేణి గ్లోబల్‌ లిమిటెడ్‌ పేర్లతో కొత్త కంపెనీలను ఈ ఏడాది నవంబర్‌లో నమోదు చేశారు. ప్రస్తుతం అంకుర దశలో ఉన్న రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌, స్ట్రాటెజిక్‌ మినరల్స్‌, కాపర్‌, బంగారం, గ్రాఫైట్‌ మైనింగ్‌, ఫ్లోటెట్‌ సోలార్‌, పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ తదితర ప్రాజెక్టులను కాగితాలకే కాకుండా క్షేత్రస్థాయిలో బలంగా నిలబెట్టాల్సి ఉంది. అయితే, సింగరేణి విస్తరణలో ఇప్పటి వరకు కీలక భూమిక నిర్వహిస్తూ వచ్చిన సీఎండీ బలరాం ఇటీవల డిప్యూటేషన్‌ ముగియడంతో తిరిగి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ఇన్‌చార్జ్‌ సీఎండీగా కృష్ణభాస్కర్‌ విధుల్లో చేరారు. ఇప్పటికే ఆయనపై అనేక ఇతర బాధ్యతలు ఉన్నాయి. దీంతో విస్తరణ విషయంలో గత వేగం కనిపించేనా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. గ్లోబల్‌ కంపెనీగా బలమైన పునాదులు పడే వరకు బలరాంనే ఈ పోస్టులో కొనసాగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించి ఉండాల్సిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement