ముమ్మరంగా ముక్కోటి ఏర్పాట్లు
భద్రాచలంటౌన్: ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం, వైకుంఠ ద్వార దర్శన వేడుకల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. భద్రాచలంలోని గోదావరి కరకట్ట, రివర్ ఫెస్టివల్ వేదికలను ఆదివారం పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా గోదావరి రివర్ ఫెస్టివల్‌ను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. కరకట్ట వద్ద రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆదివాసీ కళారూపాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22 నుంచి 30 వరకు జిల్లాలోని కిన్నెరసాని, బెండలపాడు కనిగిరి గుట్టలు, బొజ్జిగుప్ప వంటి పర్యాటక ప్రాంతాలను భక్తులు సందర్శించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్, ఏఈ వెంకటేశ్వర్లు, ఆర్.డబ్ల్యూఎస్ ఏఈఈ రాము, డీఈ రవితేజ, దేవస్థానం డీఈ రవీందర్, ఏపీఎం త్రిగుణ, జగదీశ్వర్, జీపీఈఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.
యువత క్రీడల్లో రాణించాలి
యువత క్రీడల్లో రాణించాలని, ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవరుచుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భద్రాచలం ఫుట్‌బాల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. అనంతరం అండర్–14 విభాగంలో గెలుపొందిన అశ్వాపురం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. క్రీడాకారులకు ఫుట్‌బాల్ కిట్లు, దుస్తులను పంపిణీ చేశారు. చందు, సలీం, మన్మధ, రాజు, జీవీ రామిరెడ్డి, జీఎస్ శంకర్ రావు పాల్గొన్నారు.
కేయూ విజేతలకు అభినందన
పాల్వంచ: ఈ నెల 19,20 తేదీల్లో జరిగిన కాకతీయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో ఏడు బంగారు, ఒక రజిత, 11 కాంస్య పతకాలు, వర్సిటీ ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించిన విద్యార్థులను ఆదివారం శ్రీనివాస కాలనీ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ అభినందించారు. జాతీయ స్థాయి టెన్నిస్‌లో 55 సంవత్సరాలు పైబడిన విభాగంలో విన్నర్ కప్ సాధించిన అన్నం వెంకటేశ్వర్లును, కోచ్ పి.నాగేంద్రబాబును సత్కరించారు. డీవైఎస్‌వో పరంధామ రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ మహిధర్, ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ నరేష్, ప్రిన్సిపాల్ అనురాధ, టెన్నిస్ కోచ్ డానియేల్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్


