కూర్మావతారంలో రామయ్య..
శ్రీసీతారామచంద్ర స్వామివారికి భక్తజనం జేజేలు
భద్రాచలం: క్షీరాబ్ది సమయంలో మందరగిరిని తన వీపున మోసి దేవతలకు అమృతం అందించిన కూర్మావతార రాముడిని భక్తులు కనుల నిండుగా దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా భద్రాచల రామయ్య ఆదివారం కూర్మావతారంలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించి ఆరాధన, ఆరగింపు ఇచ్చారు. వేద పండితులు స్వామివారికి దివ్య ప్రబంధం చేశారు. రెండు వందల నాళాయిర దివ్య ప్రబంధాలను చదివారు. పన్నెడు మంది ఆళ్వార్లకు పరివట్టం కట్టి పూలమాలలు వేసి తులసి దళాలు సమర్పించారు. అనంతరం కూర్మావతారంలో ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చారు.
రోటరీ క్లబ్ సంస్థ సహకారంతో శోభాయాత్ర
కూర్మావతారానికి భద్రాచలం రోటరీ క్లబ్ బాధ్యులు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేక పల్లకీపై స్వామివారిని ఉంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. స్వామివారిని మాడవీధుల మీదుగా మిథిలా స్టేడియం ప్రాంగణంలోని అధ్యయనోత్సవ వేదిక వద్దకు తీసుకొచ్చి హారతి సమర్పించారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులుదీరారు. స్వామివారిని దర్శించుకుని నైవేద్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు అర్చకస్వాములు ఆశీర్వచనాలు అందజేశారు.
వైభవంగా తిరువీధి సేవ
అధ్యయనోత్సవ వేదికపై ప్రత్యేక పూజలు అందుకున్న స్వామివారు ఊరేగింపుగా తిరువీధి సేవకు వెళ్లారు. తాతగుడి వీధిలోని విశ్రాంతమండపం వద్దకు తీసుకెళ్లి అక్కడ కొద్దిసేపు ఉంచి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఊరేగింపుగా తాతగుడి వరకు స్వామివారిని తీసుకెళ్లి తిరిగి గర్భగుడికి తీసుకొచ్చారు. దారి పొడవునా భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి ప్రసాదాలు అందుకున్నారు.
నేడు వరాహావతారంలో..
అధ్యయనోత్సవాలలో భాగంగా రామయ్య సోమవారం వరాహావతారంలో దర్శనమివ్వనున్నారు. ప్రజాసృష్టి చేద్దామనుకున్న స్వయంభువుని, బ్రహ్మాదుల మొర విన్న నారాయణుడు నీటిలో మునిగిఉన్న భూమిని బయటికి తీయడానికి వరాహావతారాన్ని ధరించాడు. భూమిని తన కోరలతో పైకెత్తాడు. ఈ కార్యంలో ఆటంకం కలిగించిన లోకకంటకుడైన హిరణ్యాక్షుడు అనే రాక్షసుడుని సంహరించి భూమిని రక్షించాడు. రాహు గ్రహ బాధలున్న వారు ఈ అవతారాన్ని దర్శిస్తే బాధల నుంచి విముక్తులవుతారని భక్తులు విశ్వసిస్తారు.


