గోపాలమిత్రల గోస
● తొమ్మిది నెలలుగా అందని వేతనాలు ● వెతలు చెప్పినా పట్టించుకోని పాలకులు ● ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలు
లక్ష్యం చేరకపోతే..
గోపాలమిత్రలకు కృత్రిమ గర్భధారణ విషయంలో పశుసంవర్థకశాఖ టార్గెట్ విధిస్తుంది. ఆ లక్ష్యాన్ని చేరకపోతే వేతనంలో కోత విధిస్తారు. ఏడాదికి ఒక్కో గోపాలమిత్ర 1000 కృత్రిమ గర్భధారణ సెమన్‌లను పశువులకు వేయాల్సి ఉంటుంది. పశువులు ఎదకు వచ్చే సమయాన్ని గుర్తించి, వాటి యజమానిని ఒప్పించి టార్గెట్ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇలా టార్గెట్ పూర్తి కాని గోపాలమిత్రలు నెలకు రూ.ఐదారు వేల వేతనం కూడా అందుకోలేకపోతున్నారు. వేతనాల కోసం ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించినా ఫలితం ఉండడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తమ గోస ఆలకించి ప్రతినెలా వేతనాలు అందించాలని కోరుతున్నారు.
బూర్గంపాడు: తొమ్మిది నెలలుగా వేతనాలు అందక గోపాలమిత్రలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందించే అరకొర వేతనం కూడా నెలల తరబడి అందకపోవడంతో వారికి కుటుంబ పోషణ భారంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 262 మంది గోపాలమిత్రలు వేతనాలు అందక అగచాట్లు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పశు వైద్యం అందించడంలో కీలకంగా పనిచేస్తున్న వీరి బతుకులు దయనీయంగా మారాయి.
2000లో నియామకం
పశుసంవర్థక శాఖలో సరిపడా సిబ్బంది లేకపోవడంతో ప్రభుత్వం 2000 సంవత్సరంలో గోపాలమిత్రలను నియమించింది. వీరు గ్రామాల్లో పశు వైద్య సహాయకులుగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా పశుసంవర్థక శాఖ అందించే సెమన్‌ను ఎదకు వచ్చిన పశువులకు ఇచ్చి మేలుజాతి దూడలను పెంపొందించటంలో వారి పాత్ర కీలకం చేశారు. దీంతో పాటు పశువులు, జీవాలకు వ్యాక్సినేషన్‌లో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. పశువులు, గొర్రెలు, మేకలకు ప్రాథమిక వైద్యం అందించడంలో కూడా కీలకంగా మారారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పశు సంవర్థక శాఖలో 262 మంది గోపాలమిత్రలు పనిచేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో వీరికి నెలకు రూ 11,050 వేతనం అందిస్తున్నారు. అయితే అది కూడా నెలనెలా సక్రమంగా రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో పశువులకు వైద్యం చేసేందుకు నిత్యం వెళ్తుండగా బైక్ పెట్రోలు, టిఫిన్, భోజనాల ఖర్చులు కూడా ఇబ్బందికరంగా మారాయి. నెలకు ఇచ్చే వేతనం ఎటూ సరిపోవడం లేదని ఆవేదన చెందుతున్న వీరు.. ఆ వేతనం కూడా నెలనెలా అందకపోవడంతో అప్పుల పాలవుతున్నారు.
ఆర్థికంగా ఇబ్బందులు
గోపాలమిత్రలకు వేతనాలు అందక ఆర్థికంగా చితికిపోతున్నాం. రోజూ గ్రామాల్లో పశువులకు వైద్యసేవలు అందించేందుకు బైక్‌పై వెళితే పెట్రోలు ఖర్చులకు కూడా ఇబ్బందిగా ఉంది. 20 ఏళ్లుగా గ్రామాల్లో వైద్యసేవలు అందిస్తున్నా వేతనాలు పెంచకపోగా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడంతో ఇబ్బంది అవుతోంది. వేతనాలు పెంచి ప్రతినెలా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – చింతమల్ల కిరణ్,
గోపాలమిత్ర, పినపాక పట్టీనగర్
సకాలంలో వేతనాలు అందించాలి
వేతనాలు సకాలంలో అందక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. కృత్రిమ గర్భధారణలో టార్గెట్‌ల కారణంగా వేతనాల్లో కోత విధిస్తున్నారు. 9 నెలలుగా వేతనాలు అందకపోవడంతో మా కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాయి. విద్యాసంవత్సరం ఆరంభమవుతున్న తరుణంలో పిల్లల చదువులకు ఇబ్బంది కలగకుండా 9 నెలల వేతనం చెల్లించాలి.
– తాతిరెడ్డి గోవిందరెడ్డి,
గోపాలమిత్ర, బూర్గంపాడు
గోపాలమిత్రల గోస
గోపాలమిత్రల గోస


