అమరుల త్యాగఫలితమే తెలంగాణ
సింగరేణి(కొత్తగూడెం): ఎంతోమంది అమరుల త్యాగఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన జాతాయ పతాకాన్ని ఆవిష్కరించారు. సెక్యూరిటీ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. సంస్థ వ్యాప్తంగా గల 11 ఏరియాలకు చెందిన ఉత్తమ కార్మికులను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరు దశాబ్దాల పాటు ఎంతోమంది అలుపెరగని పోరాటం చేశారని అన్నారు.
భూగర్భ గనులతో నష్టం..
సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని 24 భూగర్భ గనులతో సంస్థకు ఏడాదికి రూ.13,093 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని బలరామ్ తెలిపారు. ఓసీలు, సంస్థ డిపాజిట్లు, థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చే ఆదాయాన్ని లాభాలుగా చూపిస్తున్నామని చెప్పారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో శావెల్స్ 74 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, కంపెనీలో ఉన్న 66 శావెల్స్ రోజుకు 19 గంటలకు పైగా అందుబాటులో ఉంటున్నా.. వాటిని 12 గంటలు, 425 డంపర్లు రోజుకు 18 గంటలు అందుబాటులో ఉంటుండగా 8 గంటలు మాత్రమే వినియోగిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. యంత్రాలు పనిచేస్తేనే ఉత్పత్తి ఖర్చు తగ్గి లాభాలు వస్తాయన్నారు. సింగరేణి పరిధిలో ఇప్పటికీ 1,633 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు సింగరేణి కంటే తక్కువ ధరకు బొగ్గు విక్రయిస్తున్న నేపథ్యంలో బొగ్గు ధర తగ్గింపునకు బోర్డు త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు వేసిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, కె. వెంకటేశ్వర్లు, యూనియన్ నాయకులు రాజ్‌కుమార్, రమణమూర్తి, పీతాంబరరావు, సీఎంఓఏఐ నాయకులు రాజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాత్రి జరిగిన వేడుకలకు సీఎండీతో పాటు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. సంస్థ విస్తరణలో భాగంగా 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్, 1,500 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రాజస్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. విదేశాల్లో కూడా జాయింట్ వెంచర్ కంపెనీగా ఏర్పాటుకు కృషి జరుగుతోందని వివరించారు. ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. 2009 – 2014 మధ్య తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కొత్తగూడెంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని, ఆ సమయంలో తాను సుమారు 30 రోజలు పాదయాత్ర నిర్వహించానని చెప్పారు.
సింగరేణి సీఎండీ బలరామ్
సంస్థ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు
అమరుల త్యాగఫలితమే తెలంగాణ


