రోహిణి కార్తె ప్రతాపం
జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు
బూర్గంపాడు: ఉపరితల ఆవర్తనంతో శనివారం వరకు చల్లగా ఉన్న వాతావరణం ఆదివారం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రోహిణి కార్తె ఎండ తీవ్రత జిల్లా వ్యాప్తంగా కనిపించింది. శుక్రవారం వరకు ఆడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు సాగు పనులు మొదలుపెట్టారు. రుతుపవనాలు కూడా విస్తరిస్తున్నాయనే వాతావరణ సూచనలతో కొందరు రైతులు పత్తిగింజలు వేయటం కూడా మొదలు పెట్టారు. ఆదివారం ఎండ తీవ్రతకు పొలం పనులకు వెళ్లిన రైతులు, కూలీలు మధ్యాహ్ననికే ఇంటిదారి పట్టారు. కొందరు రైతులు వేసిన పత్తిగింజలు మొలకలు తిరిగి ఎండిపోతున్నాయి. పత్తిగింజలు వేసేందుకు సిద్ధమైన కొందరు రైతులు ఎండల తీవ్రతకు వెనుకడుగు వేస్తున్నారు.
సింగరేణి అధికారుల బదిలీ
సింగరేణి(కొత్తగూడెం): వివిధ ఏరియాల్లోని ఐఈడీ విభాగంలో పనిచేస్తున్న ఏడుగురు అధికారులను బదిలీచేస్తూ ఆదివారం సింగరేణి యాజమాన్యం ఉత్తర్యులు జారీ చేసింది. మణుగూరు ఏరియా ఏజీఎం కె.వెంకట్రావును కార్పొరేట్ హెచ్‌ఓడీగా, కార్పొరేట్‌లో హెచ్‌వోడీగా పనిచేస్తున్న సీహెచ్ సీతారాంబాబును మణుగూరుకు, మందమర్రి ఏరియా డీవైజీఎం పి.రాజన్నను శ్రీరాంపూర్‌కు, భూపాలపల్లి డీవైజీఎంగా ఏ.వసంతరావును కార్పొరేట్ హెచ్‌వోడీగా, శ్రీరాంపూర్ ఏరియా ఎస్‌ఈ కె.కిరణ్ కుమార్‌ను మందమర్రికి, కార్పొరేట్ ఏరియా సీపీపీ ఎస్‌ఈ ఎం.మనోజ్‌కుమార్‌ను ఈఆర్‌పీ వింగ్‌కు, మణుగూరు ఎస్‌ఈ ఎం.శ్రీనివాసులును కార్పొరేట్ సీపీపీ విభాగానికి బదిలీ చేశారు. వీరందరూ ఈ నెల 11వ తేదీ తేదీలోగా కేటాయించిన ఏరియాల్లో విధుల్లో చేరాలని సూచించింది.
కరాటే పోటీల్లో
బంగారు పతకాలు
గుండాల: జాతీయస్థాయి కరాటే పోటీల్లో పాల్గొన్న పలువురు విద్యార్థులు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందుకున్నారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన జాతీయ కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో గుండాల మండలం నుంచి 23 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆరుగురు స్వర్ణ, ఆరుగురు రజత, మరో 11 మంది కాంస్య పతకాలను అందుకున్నారని కోచ్ సుధాకర్ తెలిపారు. విజేతలను అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.
మందుపాతరలు నిర్వీర్యం
చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పోలీసు బలగాలను మట్టుబెట్టాలన్న లక్ష్యంతో మావోయిస్టులు ఏర్పాటు చేసిన 10 శక్తిమంతమైన మందుపాతరలను ఆదివారంభద్రతా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశాయి. ఈ ఘటన కోహిమెట్టా పోలీస్ స్టేషన్ పరిధి కుతుల్ సీఆర్‌పీఎఫ్ క్యాంపు సమీపంలోని కొడ్బార్–గుర్బా గ్రామాల అటవీ ప్రాంతంలో జరిగింది. మందుపాతరలను నిర్వీర్యం చేయడంతో పోలీసు బలగాలకు పెను ప్రమాదం తప్పింది. కాగా ఆ ప్రాంతంలో మరిన్ని మందుపాతరలు ఉన్నాయనే అనుమానంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
రోహిణి కార్తె ప్రతాపం


