పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలి
కొత్తగూడెంఅర్బన్/జూలూరుపాడు: తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్య పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి బి.రాజు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపు కోసం ఆ సంఘం ఆధ్వర్యంలో ప్రచార జాతా నిర్వహిస్తున్నారు. శనివారం కొత్తగూడెం రైల్వే స్టేషన్, బస్టాండ్, పోస్ట్ ఆఫీస్ సెంటర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో, జూలూరుపాడులో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం ఉన్నాయని చెప్పారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వారానికి మూడుసార్లు గుడ్లు, రాగిజావ అందిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఫీజుల భారం తగ్గించుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో విద్యా వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోందని, తల్లిదండ్రుల ఆకాంక్షలను ప్రైవేట్ విద్యాసంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయని ఆరోపించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి ఎస్.వెంకటేశ్వర్లు, నాయకులు బి.లక్ష్మా, బి.మంగీలాల్, ఎదళ్లపల్లి వీరస్వామి, బి శంకర్, గురుమూర్తి, ఆర్ నాగజ్యోతి పాల్గొన్నారు.
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి


