నేడు జీఎం ఆఫీస్, వర్క్‌షాపు ప్రారంభం
● ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ● రూ.455.4 కోట్లతో వీకే–7 ఓసీ విస్తరణ పనులు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియాలో నూతనంగా నిర్మించిన జీఎం కార్యాలయం, వర్క్‌షాపును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం ప్రారంభించనున్నారు. వెంకటేష్ ఖని (వీకే–7 షాఫ్ట్) భూగర్భ గనిలో నిక్షేపాలు పూర్తికావడంతో విస్తరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో యాజమాన్యం రూ.455.4 కోట్లతో విస్తరణ పనులు నిర్వహిస్తోంది. సుమారు 184 మిలియన్ టన్నుల మిగులు నిక్షేపాలున్న వీకే–7 విస్తరణ గనికి దాదాపు 30 సంవత్సరాల జీవిత కాలం ఉండే అవకాశం ఉంది. దీంతో రూ.333 కోట్లతో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, రూ. 10 కోట్లతో ఏరియా వర్క్‌షాపు, జీఎం కార్యాలయం, రూ.80 కోట్లతో రైల్వే సైడింగ్ పనులు, రూ.20 కోట్లతో హైవే మళ్లింపు పనులు, రూ. 3.4 కోట్లతో ఫిల్టర్‌బెడ్ నిర్మాణ పనులు చేపట్టారు. వీటి పనులు ఏడాది క్రితమే పూర్తయినా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. డిప్యూటీ సీఎం శనివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి పాల్వంచ చేరుకుని కిన్నెరసానిలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ పాఠశాలలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారని, 1:50 గంటలకు 3 ఇంక్‌లైన్‌లో నూతన జీఎం కార్యాలయం, 4 ఇంక్‌లైన్‌లోని వర్క్‌షాపులను ప్రారంభిస్తారని, అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్తారని వివరించారు.


