
కుమార్తెకు ఓణీల ఫంక్షన్ చేసి..
మరుసటిరోజు గుండెపోటుతో తండ్రి మృతి
జూలూరుపాడు: తన కుమార్తెకు ఓణిల ఫంక్షన్ చేసిన తండ్రి మరుసటిరోజే గుండెపోటుతో మృతిచెందిన విషాద ఘటన మండలంలోని అనంతారంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్కం వెంకటేశ్వర్లు (55) ఓ ప్రైవేట్ బస్సుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తన చిన్న కుమార్తె నాగపంచమి ఓణీల ఫంక్షన్ చేశారు. మంగళవారం ఉదయం గుండెపోటుతో వెంకటేశ్వర్లు మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. మృతుడికి భార్య బాపమ్మ, ఇద్దరు కుమార్తెలు నాగప్రసన్న, నాగపంచమి ఉన్నారు.
అనారోగ్యంతో బాలింత మృతి
జూలూరుపాడు: మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన బాలింత సిద్ధెల శ్రావణి (21) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. రెండేళ్ల కిందట కాకర్ల గ్రామానికి చెందిన సిద్ధెల కిశోర్‌కు కల్లూరు మండలం చినకోరుకొండకు చెందిన శ్రావణితో వివాహమైంది. అనంతరం గర్భం దాల్చడంతో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. నెల రోజుల కిందట ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, శ్రావణి పది రోజులుగా జ్వరంతోపాటు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో అక్కడ ఆసుపత్రిలో చేరింది. అయినా తగ్గకపోవడంతో భర్త కిశోర్ ఆమెను కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శ్రావణి మంగళవారం మృతిచెందింది.
కుటుంబ కలహాలతో
వ్యక్తి ఆత్మహత్య
గుండాల: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆళ్లపల్లి ఎస్‌ఐ సోమేశ్వర్ కథనం ప్రకారం.. కాచనపల్లి గ్రామానికి చెందిన పరిషక లక్ష్మయ్య (45 )సోమవారం సాయంత్రం మద్యం తాగి రావడంతో భార్య మందలించింది. మనస్తాపానికి గురై గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
బైక్‌ను ఢీకొన్న కారు
జూలూరుపాడు: మండలంలోని వినోభానగర్ సమీపంలో తల్లాడ – కొత్తగూడెం ప్రధాన రహదారిపై బైక్‌ను కారు ఢీకొన్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం పూసుగూడెంనకు చెందిన ధరావత్ ప్రవీణ్ బైక్‌పై ఖమ్మం నుంచి పాల్వంచ వెళ్తున్నాడు. వినోభానగర్ గ్రామం దాటిన తరువాత ఎదురుగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టడంతో ప్రవీణ్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్ హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

కుమార్తెకు ఓణీల ఫంక్షన్ చేసి..