
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. చండ్రుగొండకు చెందిన ఎస్కే మౌలాన (70) అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటలో ఉంటున్నాడు. మధ్యాహ్నం తన ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో సత్తుపల్లి నుంచి బొగ్గులోడుతో కొత్తగూడెం వైపు వెళ్తున టిప్పర్ ఢీకొట్టింది. దీంతో మౌలానా అక్కడికక్కడే మృతిచెందగా.. వేగంగా వెళ్తున్న టిప్పర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతుడి కుటుంబీకులు, స్థానికులు జాతీయ రహదారిపై బైఠాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేశారు. మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం కొత్తగూడెంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ నాగరాజు తెలిపారు. మృతుడికి భార్య, ఏడుగురు పిల్లలు ఉన్నారు.
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు
భద్రాచలంఅర్బన్: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ముద్దాయికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ భద్రాచలం ప్రథమ శ్రేణి న్యాయమూర్తి మంగళవారం తీర్పునిచ్చారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ ముదిగొండ రామకృష్ణ 2022 ఏప్రిల్ 22న ఓ గర్భిణికి సిజేరియన్ చేస్తున్న సందర్భంలో ముద్దాయి గుర్రం లాల్‌ఖాన్ సదరు మహిళతో అవమానకరంగా ప్రవర్తించాడని భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయగా పూర్వాపరాలు పరిశీలించిన జడ్జి శివనాయక్ మంగళవారం పైవిధంగా తీర్పునిచ్చారు.
అక్రమంగా మట్టి తవ్వుతున్న జేసీబీ సీజ్
దమ్మపేట: అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న జేసీబీని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. మండలంలోని అప్పారావుపేట శివారులో మంగళవారం అనుమతులు లేకుండా జేసీబీ యంత్రంతో మట్టిని తవ్వి, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. గ్రామస్తులు తవ్వకాలను అడ్డుకుని, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్‌ఐ భిక్షం జేసీబీని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి