
పత్తి సాగుకు సై !
దుక్కులు సిద్ధం చేస్తున్న రైతులు
● ఉమ్మడి జిల్లాలో 4.27 లక్షల ఎకరాల్లో సాగు అంచనా ● 9 లక్షలకు పైగా విత్తన ప్యాకెట్ల అవసరం ● త్వరలోనే డీలర్లతో భేటీ, విక్రయాలకు అనుమతి
ఖమ్మంవ్యవసాయం: పత్తి సాగుకు సమయం సమీపిస్తోంది. కొద్దిరోజులుగా అడపాదడపా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు దుక్కులు దున్నే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 27వ తేదీ నాటికి దేశంలోకి ఆ తర్వాత, కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. తొలకరి వర్షాలు కురవగానే రైతులు పత్తి సాగుపై దృష్టి సారించనుండడంతో అవసరమైన ఏర్పాట్లకు వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది.
పెరిగిన విత్తన ధరలు
ఈ ఏడాది ఖమ్మం జిల్లాలోని 2.13 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2.14 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ ప్రణాళికలో పేర్కొంది. ఎకరాకు 450 గ్రాములవి రెండు విత్తన ప్యాకెట్లను వినియోగిస్తారు. ఉమ్మడి జిల్లా రైతులకు అవసరమైనవే కాక అదనంగా కలిపి 10.10 లక్షల మేర ప్యాకెట్లను సమకూర్చాలని భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ విత్తన కంపెనీల నుంచి ఖమ్మం జిల్లా డీలర్లు 36,279 ప్యాకెట్లు, భద్రాద్రి జిల్లా డీలర్లు 1.83 లక్షల ప్యాకెట్ల విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక్కడి నేలలకు అనుకూలమైన నూజివీడు, తులసి, యూఎస్, రాశి, ఆశ, డాక్టర్ బెంట్, నీరజ, అంకూర్, కావేరి తదితర కంపెనీ విత్తనాలను అమ్మేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, గత ఏడాది 450 గ్రాముల విత్తన ప్యాకెట్ ధర రూ.864 ఉండగా, ఈ ఏడాది రూ.37 పెంచి రూ.901గా నిర్ణయించారు.
త్వరలోనే డీలర్లతో సమావేశం
పత్తి సీజన్ సమీపిస్తున్న వేళ విత్తన విక్రయాలపై డీలర్లతో సమావేశం నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. నాణ్యమైన విత్తనాల విక్రయం, ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రిజిస్టర్ల నిర్వహణ, ధరలు, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో విత్తన విక్రయాలకు ఇచ్చే అనుమతులపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
టాస్క్‌ఫోర్స్ బృందాల ఏర్పాటు
నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా అరికట్టేలా మండలాలు, డివిజన్ల వారీగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. మండల, డివిజన్, జిల్లాస్థాయిలో ఏర్పాటుచేసే ఈ బృందాల్లో వ్యవసాయ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులను సభ్యులుగా నియమిస్తారు. జిల్లాస్థాయి బృందాల్లో ఏడీఏ, డీఎస్పీ లేదా సీఐ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారి, డివిజన్‌స్థాయి కమిటీలో ఏడీఏ, ఎంఈఓ, మండలస్థాయి కమిటీలో ఏఓ, ఎస్‌ఐలు, రెవెన్యూ సిబ్బంది ఉంటారు. అనుమతి లేకుండా గ్రామాల్లో విత్తనాలు అమ్మే దళారులు.. అక్రమాలకు పాల్పడే డీలర్లపై నిఘా వేసి రైతులు మోసపోకుండా చర్యలు తీసుకుంటారు.
ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు ప్రణాళిక
జిల్లా సాగు (ఎకరాల్లో)్ఞ విత్తనాలు (ప్యాకెట్లు) అందుబాటులో ఉన్నవి
ఖమ్మం 2.13లక్షలు 4.82 లక్షలు 37 వేలు
భద్రాద్రి 2.14లక్షలు 4.84 లక్షలు 1.83లక్షలు
త్వరలోనే భేటీ, అనుమతులు
పత్తి సాగు చేసే రైతులకు అవసరమైన విత్తనాలు సమకూర్చనున్నాం. లైసెన్స్‌డ్ డీలర్ల వద్ద అందుబాటులోకి తీసుకొస్తాం. అయితే, ఇంకా విత్తన విక్రయాలకు అనుమతులు ఇవ్వలేదు. త్వరలోనే డీలర్లతో సమావేశం నిర్వహించి విక్రయాలకు చర్యలు తీసుకుంటాం. అలాగే, నకిలీ విత్తన విక్రయాలను సమర్థవంతంగా నిలువరించేలా టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేస్తాం.
–ధనసరి పుల్లయ్య, ఖమ్మం డీఏఓ

పత్తి సాగుకు సై !

పత్తి సాగుకు సై !