
శిథిలావస్థలో సీఎంపీఎఫ్ కార్యాలయం
● 1985లో నిర్మాణం ● పర్యవేక్షణ కరువు.. నాణ్యతా లోపం.. ● క్వార్టర్లదీ అదే పరిస్థితి
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని సీఎంపీఎఫ్ (కొత్తగూడెం రీజియన్) భవనం శిథిలావస్థకు చేరింది. 1985లో సీఎంపీఎఫ్ సెంట్రల్ కార్యాలయం వారు కేటాయించిన నిధులతో సింగరేణిి యాజమాన్యం కాంట్రాక్టర్ ద్వారా నిర్మించిన ఈ భవనాన్ని 1987లో ఆనాటి సీఎంపీఎఫ్ కమిషనర్ శంకర్ ప్రసాద్ ప్రారంభించారు. 40 ఏళ్లకే పూర్తి శిథిలావస్థకు చేరిందంటే కాంట్రాక్టర్ కట్టిన నాణ్యత ఇట్టే అర్థం అవుతుంది. అంతే కాకుండా సివిల్ అధికారుల పర్యవేక్షణ, అధికారుల నిబద్ధత గురించి కార్మికులు గుసగుసలాడుతున్నారు. రీజియన్ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల భవిష్యనిధి అంటే సుమారు 20 వేల మంది కార్మికుల భవితవ్యం ఈ కార్యాలయంలో ఉంటుంది. కార్పొరేట్ ఏరియాకు కూతవేటు దూరంలోనే సివిల్ జీఎంలతోపాటు, ఇతర ఉన్నతాధికారులు ఉండే కార్యాలయ నిర్మాణం ఈవిధంగా ఉందంటే ఇతర ఏరియాలలో కాంట్రాక్టర్లు నిర్మించి భవనాల తీరు ఏవిధంగా ఉంటుందో, ఎంత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారో అర్థం అవుతంందని కార్మికులు చర్చించుకుంటున్నారు.
పెచ్చులు ఊడి పడుతున్న స్లాబ్..
భవనంలో స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నాయి. ఎప్పడు ఏం జరుగుతుందోనని భయాందోళనలతో ఉద్యోగులు ఇటీవల పక్కనే ఉన్న మరో కార్యాలయంలోకి మారారు. అయినా సింగరేణి అఽధికారులు పట్టించుకోవటం లేదు. ఇదిలా ఉండగా, సీఎంపీఎఫ్ కార్యాలయం వెనక సింగరేణి కాంట్రక్టర్లు నిర్మించిన క్వార్టర్లు కూడా ఇదే పరిస్థితి. ఇటీవల కాలంలో మరమ్మతులు చేశారు. అయినా మార్పు లేదని, ఉద్యోగులు గమనించి బయట కిరాయికి ఉంటున్నారు. క్వార్టర్లు ఉండి ఉద్యోగులు బయట కిరాయికి ఉండటం గర్హనీయం. ఈ భవనం, క్వార్టర్ల కోసం సుమారు 40 ఏళ్ల క్రితం ఆనాటి ఎస్టేట్స్ అధికారులకు సుమారు 5 ఏకరాల స్థలాన్ని లీజ్‌కు లీజుకు ఇచ్చింది. కార్మికుల భవిష్యనిధి వివరాలు, సీఎంపీఎఫ్ పేరిట వసూలు అవుతున్న కోట్లాది రుపాయల లెక్కలు ఉండే కార్యాలయం, క్వార్టర్ల మెయింటునెన్స్‌ను కంపెనీ పట్టించుకోకపోవటం విచారకమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కార్పొరేట్ ఆధికారులు సీఎంపీఎఫ్ కార్యాలయం, క్వార్టర్లపై దృష్టి సారించి మరమ్మతులు చేయించి, ఉద్యోగులకు ఇవ్వాలని లేదంటే పట్టణం నడిబొడ్డున ఉన్న ఈ క్వార్టర్ల స్థలం కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉందని కార్మికులు అంటున్నారు.