
మరో థర్మల్ కేంద్రం వచ్చేనా!
పాల్వంచ: రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న పాల్వంచ కేటీపీఎస్‌లో మరో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక్కడ కాలం చెల్లిన 720 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కేటీపీఎస్ ఓఅండ్‌ఎం( పాతప్లాంట్)ను తొలగించారు. ఇందులో పనిచేసే సుమారు రెండు వేల మంది ఉద్యోగ, కార్మికులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ఈ క్రమంలో వారు కుటుంబాలతో సహా వెళ్లిపోవడంతో పాల్వంచ పట్టణంపై తీవ్ర ప్రభావం పడింది. వర్తక, వాణిజ్య, ఉపాధి, రియల్ ఎస్టేట్ రంగాలు దెబ్బతిని అభివృద్ధి కుంటుపడుతోంది. పాల్వంచ కళతప్పింది. ఇక్కడి భౌగోళిక వనరుల దృష్ట్యా మరో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (కేటీపీఎస్ 8వ దశ) నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. శనివారం పాల్వంచలో పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టి సారించి పాల్వంచకు పూర్వవైభవం తెచ్చేలా కృషి చేయాలని విన్నవిస్తున్నారు.
అందుబాటులో వనరులు
కాలం చెల్లింన కేటీపీఎస్ ఓఅండ్‌ఎం(పాత ప్లాంట్) కర్మాగారాన్ని 2018 సంవత్సరంలో మూసివేశారు. అనంతరం పాత ప్లాంట్‌లోని నిర్మాణాలన్నింటినీ తొలగించారు. ఈ క్రమంలో అక్కడ వందలాది ఎకరాల స్థలం ఖాళీ ఏర్పడింది. కేటీపీఎస్ ఏ, బీ, ఇంటర్మీడియట్ కాలనీలు చాలా వరకు శిథిలావస్థకు చేరాయి. దీంతో ఆ క్వార్టర్లను తొలగించి అపార్ట్‌మెంట్‌లు నిర్మించాలని యాజమాన్యం యోచిస్తోంది. ఇది కార్యరూపం దాలిస్తే ఆయా కాలనీల్లో సైతం స్థలం మిగిలే అవకాశం ఉంది. కేటీపీఎస్ విస్తరణకు ఈ స్థలాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. తద్వారా సౌకర్యాలు మరింతగా మెరుగుపడనున్నాయి. ఇక కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి పుష్కలంగా నీరు , కొత్తగూడెం, మణుగూరుల నుంచి రైల్వే మార్గాల ద్వారా సింగరేణి బొగ్గు సరఫరా అవుతోంది. పాత యాష్ పాండ్‌లు, నీటి నిల్వ ప్రాంతాలను కూడా సద్వినియోగం చేసుకుని తక్కువ ఖర్చుతో మరో విద్యుత్ కేంద్రం నిర్మించవచ్చు.
రెండు వేల మంది ఉద్యోగులు బదిలీ
ఓఅండ్‌ఎం మూసివేయడంతో సుమారు రెండు వేల మంది ఉద్యోగులు ఇతర కర్మాగారాలకు బదిలీలు, డిప్యూటేషన్‌లపై వెళ్లారు. కేటీపీఎస్‌లో నూతన కర్మాగారం నిర్మించి ఆ ఉద్యోగులను ఇక్కడికి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు సైతం కోరుతున్నాయి. ప్రస్తుతం కేటీపీఎస్ 5,6 దశల్లో 1000 మెగావాట్లు, 7వ దశలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వచ్చే పదేళ్ల తర్వాత 5,6 దశల కర్మాగారాలు సైతం కాలంచెల్లి మూసివేయాల్సి వస్తుంది. అప్పటిలోగా కొత్త కర్మాగారం అందుబాటులో తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. నూతన కలెక్టరేట్ సమీపంలోని స్థలంలో సోలార్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని జెన్‌కో యాజమాన్యం యోచించింది. సర్వే కూడా పూర్తి చేసింది. నిర్మాణ పనులు మాత్రం ముందుకు పడటం లేదు. ఈ నేపథ్యంలో నేడు పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి పాల్వంచ పట్టణాభివృద్ధిపై ప్రకటనలు చేస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కేటీపీఎస్ ఓఅండ్‌ఎం కర్మాగారం తొలగింపుతో కళతప్పిన పాల్వంచ
కొత్త కర్మాగారం ఏర్పాటుకు భౌగోళిక వనరులు పుష్కలం
నేడు పాల్వంచలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన