
ప్రతీ రైతు పొలంలో నీటి కుంట నిర్మించుకోవాలి
జూలూరుపాడు: ప్రతి రైతు వ్యవసాయ భూమిలో నీటి కుంట నిర్మించుకోవాలని అదనపు కలెక్టర్, డీఆర్డీఓ విద్యాచందన అన్నారు. మంగళవారం ఆమె మండలంలోని వీరభద్రాపురం, పడమటనర్సాపురం గ్రామాల్లో పర్యటించారు. వ్యవసాయ క్షేత్రాల్లో నీటి కుంటల నిర్మాణం కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి, మాట్లాడారు. పొలాల్లో నీటి కుంటలు నిర్మించుకుంటే భూగర్భ జలాల అభివృద్ధితోపాటు, చేపల పెంపకం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, అంగన్‌వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, ఆస్పత్రులు, రహదారులు వెంట, ప్రతి ఇంట్లో ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపట్టేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటికుంటలు, ఇంకుడు గుంతల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కరుణాకర్‌రెడ్డి, ఎంపీఓ తులసీరామ్, ఈజీఎస్ ఏపీఓ రవికుమార్, జీపీ సెక్రటరీలు, ఉపాధి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.