
కమనీయం.. రామయ్య నిత్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నిత్యాన్నదానానికి విరాళం
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదానానికి విశాఖపట్టణానికి చెందిన గవిరెడ్డి కస్తూరి నాయుడు దంపతులు రూ.1,00,016, కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం పైడికొండల పాలెం గ్రామానికి చెందిన తాళ్లూరి శ్రీయదత్త దంపతలు రూ.2.50 లక్షలు ఆలయ ఈఓ రమాదేవికి బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఈఓ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్ లింగాల సాయిబాబు, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
కలిసి నడిస్తేనే పార్టీ బలపడుతుంది
డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య
కొత్తగూడెంఅర్బన్: నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి నడిస్తేనే పార్టీ బలపడుతుందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. కొత్తగూడెంలో బుధవారం జరిగిన పార్టీ సంస్థాగత సభకు జిల్లా అబ్జర్వర్లు శ్రవణ్‌కుమార్‌రెడ్డి, ప్రమోద్‌కుమార్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాయకులు, కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతో పాటు సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాలు, ఏ, బీ బ్లాక్‌ల అధ్యక్ష పదవులకు ఆసక్తి గలవారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
కొత్తగూడెంఅర్బన్: ఇంటర్మీడిఝెట్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 27 వరకు పరీక్షలు జరగనుండగా మొదటి సంవత్సరం విద్యార్థులకు ఆదివారంతో సహా ప్రతీ రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం వారికి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటాయి. జిల్లాలో 24 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 7,635 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సమయానుకూలంగా బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్ కో అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచుతున్నారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

కమనీయం.. రామయ్య నిత్య కల్యాణం