
విద్యారంగ అభివృద్ధికి తోడ్పడాలి
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నాయకత్వ లక్షణాల పెంపుదలతో పాటు విద్యారంగాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వరాచారి అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యాశిక్షణా కేంద్రంలో హెచ్‌ఎంలకు జరుగుతున్న వృత్యంతర శిక్షణ శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించి మాట్లాడారు. విద్యారంగ డిజిటలీకరణ వైపుగా రాష్ట్రం ముందుకు సాగుతోందని, మార్పులను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుని నాయకత్వ పటిమతో పని చేయాలని సూచించారు. ఐదు రోజుల శిక్షణలో రిసోర్స్ పర్సన్లు చెప్పే అంశాలను శ్రద్ధగా విని నోట్స్ రాసుకోవాలని, పాఠశాలకు వెళ్లిన తర్వాత వాటిని సరైన రీతిలో ఆచరించాలని అన్నారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్ర సమన్వయకర్త, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్, రిసోర్స్‌పర్సన్లు ఆనందకుమార్, మీరా సాహెబ్, విజయబాబు, బాబూలాల్ పాల్గొన్నారు.
పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రారంభం..
2025 – 26 విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థుల చేతుల్లో పాఠ్యపుస్తకాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ తెలిపారు. పాఠశాలలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాకు 5,08,400 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా ఇప్పటివరకు 4,01,875 పుస్తకాలు వచ్చాయని వివరించారు.
డీఈఓ వెంకటేశ్వరాచారి