
ముందుగానే తొలకరి..
● ఉపరితల ఆవర్తనంతో వర్షాలు ● వారంలోగా రుతుపవనాలు వస్తాయంటున్న వాతావరణ శాఖ ● వానాకాలం పంటల సాగుకు రైతుల సమాయత్తం
బూర్గంపాడు: ఈ ఏడాది తొలకరి ముందుగానే పలకరిస్తోంది. మే నెలలో కురిసిన అకాల వర్షాలతో భూములు పదునయ్యాయి. గత మూడు రోజులుగా ఉపరితల ఆవర్తనంతో జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగు పనులకు సిద్ధమవుతున్నారు. మరో వారం రోజుల్లో రుతుపవనాలు కూడా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఈ కార్తెలో సాధారణంగా ఎండల తీవ్రత పెరుగుతుంది. అయితే ఉపరితల ద్రోణి ప్రభావం, రుతుపవనాలు ముందస్తుగా వస్తాయనే సమాచారంతో ఈ ఏడాది ముందుగానే పంటలు సాగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
పదునెక్కిన భూములు..
ఇటీవలి వర్షాలతో భూములు పదునెక్కగా వానాకాలం పంటల సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేస్తున్నారు. జూన్ మొదటి వారం నుంచే పత్తితో పాటు పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగు, పిల్లి పెసర, పెసర పంటలు కూడా సాగు చేస్తారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో జూన్ రెండో వారంలో వరి నార్లు పోస్తారు. వర్షాలు కురుస్తుండడం, రుతుపవనాలు ముందుగానే వస్తాయనే వాతావరణశాఖ సూచనలతో పంటల సాగు పనులు ప్రారంభించారు. గత సీజన్‌లో సాగు చేసిన పత్తి, మిరప వ్యర్థాలను తొలగించి భూములు శుభ్రం చేస్తున్నారు. వరి మాగాణుల గట్లు సరిచేసుకుంటున్నారు. పశువుల ఎరువు, చెరువు మట్టిని పొలాల్లో తోలుకుంటున్నారు. చేలలో నీటి గుంతలు, పంట కాల్వలు తవ్వుతున్నారు. మరోవైపున పెట్టుబడి ఖర్చులకు డబ్బులు సమకూర్చుకుంటున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలను వేసుకుంటున్నారు. ఏ భూముల్లో ఏ విత్తనాలు వేయాలి, ఏ కంపెనీ విత్తనాలు తీసుకోవాలనే చర్చ రైతుల్లో సాగుతోంది. మరో వారం రోజుల్లో సాగు పనులు ముమ్మరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.