
భూ సేకరణ వేగవంతం చేయాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
సూపర్‌బజార్(కొత్తగూడెం): సీతారామ కెనాల్ ఎత్తిపోతల పథకానికి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఆయన ఇరిగేషన్, సర్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వారం రోజుల్లో గ్రామసభల నిర్వహణ పూర్తి చేయాలని చెప్పారు. కాల్వల ఏర్పాటుతో రైతులకు భూమి విలువ పెరుగుతుందన్నారు. ఇరిగేషన్ అధికారులు, సర్వేయర్లు సమన్వయంతో భూసేకరణ చేయాలని సూచించారు. సర్వేయర్లకు అధునాతన యంత్రపరికరాలు, ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని తెలిపారు. సర్వేలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టాలని, తద్వారా నీటి నిల్వలు పెంచుకోవచ్చని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. చెరువులు, కాల్వల వెంట సుబాబుల్, తంగేడు, తాటి మొక్కలు నాటేలా అవగాహనా కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు కాశయ్య, సుమ, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, ఈఈలు అర్జునరావు, సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి
చుంచుపల్లి: మండలంలోని రామాంజనేయ కాలనీ, వెంకటేశ్వర కాలనీల సమగ్రాభివృద్ధికి శాఖల వారీగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఈ రెండు గ్రామాల్లో పర్యటించారు. డ్రెయినేజీలు, రహదారులు, ఖాళీ స్థలాలను పరిశీలించి ప్రజలకు అందుతున్న మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. రెండు గ్రామాల అభివృద్ధికి నిధుల కేటాయింపునకు సిద్ధంగా ఉన్నామని, వసతుల కల్పనకు తక్షణమే ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం తదితర పథకాల్లో ఈ గ్రామాలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ సుభాషిని, ఎంపీఓ సత్యనారాయణ, స్థానిక నాయకులు జేబీ శౌరి, దుర్గేష్ తదితరులు ఉన్నారు.