
సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి
చుంచుపల్లి: ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తం చేస్తూ విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. బుధవారం ఆయన చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చేలా బాధ్యతగా మెలగాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌లో పనిచేసే అధికారులు సిబ్బంది సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్స్ కో–ఆర్డినేషన్ సెంటర్‌ను సందర్శించారు. ఇప్పటివరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన సైబర్ నేరాల వివరాలు, వాటి పురోగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా జిల్లాలోని పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం పాటిస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సైబర్ క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్ జితేందర్, ఎస్సై ఉమ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్ రాజు