
ఆయుర్వేదం.. అందని వైద్యం
● బాధితులకు సకాలంలో అందని మందులు ● వారంలో మూడు రోజులే వస్తున్న డాక్టర్లు ● జిల్లాలో 12 వైద్యశాలలు, వెల్‌నెస్ సెంటర్లు ● అంతటా ఇదే పరిస్థితి..
ఇల్లెందు: ఆధునిక వైద్య రంగం ఎంత అభివృద్ధి చెందినా నేటికీ కొందరు ఆయుర్వేద, యునానీ, హోమియో మందులపైనే ఆధారపడుతున్నారు. అయితే సిబ్బంది కొరత, ఉన్నవారూ అంతంతమాత్రంగానే పని చేస్తుండడంతో బాధితులకు సకాలంలో మందులు అందడం లేదు. జిల్లాలో 12 ఆయుర్వేద, యునానీ, హోమియో ఆస్పత్రులు ఉండగా, డాక్టర్లు వారంలో మూడు రోజులే వైద్యశాలకు వస్తుంటారు. అప్పుడు కూడా పేషెంట్లకు సరైన చికిత్స అందడం లేదు.
ఎస్‌ఎన్‌ఓలే దిక్కు..
జిల్లాలో 12 ఆస్పత్రులకు అనుబంధంగా వెల్‌నెస్ సెంటర్లు నెలకొల్పారు. ఈ వైద్యశాలల్లో నలుగురే డాక్టర్లు ఉన్నారు. వీరంతా ప్రతీ గురు, శుక్ర, శనివారాల్లో మాత్రమే వస్తుంటారు. అతి తక్కువ మంది ఉన్న ఫార్మసిస్టులు, స్వీపర్ కం నర్సింగ్ ఆర్డర్లీ(ఎస్‌ఎన్‌ఓ)లు మాత్రమే బాధితులకు మందులు ఇస్తుంటారు. జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు ఔట్‌సోర్సింగ్ పద్ధతిన డీపీఎంలను నియమించినా వారూ అంతంతమాత్రంగానే విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్నిచోట్ల ఆస్పత్రుల తాళాలు తీసే దిక్కే లేదు.
లోపాలు అనేకం..
తెలంగాణ ఏర్పాటు తర్వాత పాలన వికేంద్రీకరణపై మొగ్గు చూపిన ప్రభుత్వం.. ఆయుర్వేద, యునానీ, హోమియో వైద్యశాలలను మాత్రం విస్మరించింది. వీటికి జిల్లా స్థాయిలో అధికారులు లేరు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు వరంగల్ కేంద్రంగా రీజినల్ డైరెక్టర్(ఆర్‌డీ) పర్యవేక్షిస్తున్నారు. అలా కాకుండా ప్రతీ జిల్లాకు పాలనాపరంగా అధికారిని నియమించడంతో పాటు సిబ్బంది సంఖ్య పెంచాలని, నిత్యం ప్రజలకు వైద్యసేవలు, మందులు అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు.
‘ఇల్‌నెస్’ సెంటర్లుగా..
జిల్లాలో 12 ఆయుర్వేద, హోమియో, యునానీ వైద్యశాలలకు అనుబంధంగా వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేసినా వాటిని తెరిచే నాథుడు లేక అవి ఇల్‌నెస్ సెంటర్లుగా మారాయి. జిల్లాలో రొంపేడు, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వాపురం, కరకగూడెం, నాగుపల్లిలో ఆయుర్వేద ఆస్పత్రులు, ఇల్లెందు, అశ్వారావుపేట, ఆర్ కొత్తగూడెంలో హోమియో, భద్రాచలం, పాపకొల్లులో యునానీ ఆస్పత్రులు ఉండగా అన్నింటికీ కలిపి నలుగురే డాక్టర్లు ఉన్నారు. ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి
ఆస్పత్రిని అందుబాటులో ఉంచాలి..
ఇల్లెందులోని హోమియో వైద్యశాలను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంచాలి. రెగ్యులర్ డాక్టర్, ఫార్మసిస్ట్, స్వీపర్‌ను నియమించాలి. సరిపడా మందులు నిల్వ ఉంచాలి. అధిరారుల పర్యవేక్షణ నిరంతరం ఉండేలా చూడాలి.
– మునిగంటి శివ, ఇల్లెందు
ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వహిస్తున్నా
ఇల్లెందు ప్రభుత్వ హోమియో వైద్యశాలలో గత కొంత కాలంగా ఇన్‌చార్జ్‌గా సేవలు అందిస్తున్నా. గార్లలో రెగ్యులర్ డాక్టర్‌గా రెండు చోట్లా పని చేయడంతో వారానికి మూడు రోజులే రావాల్సి వస్తోంది. త్వరలో డాక్టర్ పోస్టులు భర్తీ అవుతాయి. కొన్ని రకాల మందులు తక్కువ ఉన్నాయి.
– డాక్టర్ జ్యోతి, ప్రభుత్వ హోమియో వైద్యశాల, ఇల్లెందు
తీవ్రంగా మందుల కొరత..
జిల్లా వ్యాప్తంగా తక్కువ ఖర్చుతో ఆయుర్వేద వైద్యం పొందే మార్గం ఉన్నా అటు డాక్టర్లు, ఇటు మందులు అందుబాటులో లేక ప్రజల్లో ఆదరణ తగ్గింది. కొందరు ఆయుర్వేద వైద్యం, మందులపై నమ్మకంతో ఆస్పత్రిఇ వస్తున్నా వారికి సకాలంలో చికిత్స అందకపోగా మందుల కొరతా వేధిస్తోంది. డాక్టర్లు లేకపోవడంతో మందులకు ఇండెంట్ పెట్టే వారు కూడా ఉండడం లేదు.

ఆయుర్వేదం.. అందని వైద్యం