
విద్యుదాఘాతంతో వివాహిత మృతి
భద్రాచలంఅర్బన్: విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై ఓ యువతి మృతిచెందిన ఘ టన పట్టణంలోని సీతారాంనగర్‌కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. ఏపీలోని బాపట్ల జిల్లా, చింతగుంపల్లి గ్రామానికి చెందిన దేవయ్య, గ్లోరి (25) దంపతులు మూడు వారాల కిందట భద్రాచలం వచ్చి సుందరయ్యనగర్‌లో ఉంటూ ఓవ్యక్తికి చెందిన బిల్డింగ్ పని (తాపీ) చేస్తున్నారు. ఈ క్రమంలో మొదటి అంతస్తులోని కొన్ని వస్తువులను తీసుకురావాలని దేవయ్య చెప్పడంతో.. గ్లోరిపైకి వెళ్లి వస్తువులు తెస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురైంది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గ్లోరి, దేవయ్యలకు 12ఏళ్ల కిందట వివాహం కాగా, ముగ్గురు మగ పిల్లలున్నారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి..
టేకులపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. టేకులపల్లిలోని ఏ–కాలనీ సకృతండాకు చెందిన భూక్య లక్ష్మణ్ (35) బోడు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 7న విధులు ముగించుకుని తన ద్విచక్రవాహనంపై వస్తుండగా పశువులు అడ్డురావడంతో కిందపడ్డాడు. ఆయన్ను కొత్తగూడెం ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి భద్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ట్రాలీ బోల్తా పడి 13 మందికి గాయాలు
పాల్వంచరూరల్: ట్రాలీ బోల్తాపడి 13 మంది గాయపడిన ఘటన మంగళవా రం చోటుచేసుకుంది. మణుగూరు సమీపంలో మోకాళ్ల నొప్పులకు నాటు మందులు ఇస్తున్నారని.. చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి చెందిన 13 మంది ట్రాలీ ఆటోలో బయలుదేరారు. పాల్వంచ మండలం జగన్నాథపురం శివారులో బీసీయం జాతీయ రహదారిపై వాహనం బ్రేక్‌లు ఫైయిల్ కావడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. అందులోని 13మంది గాయపడగా పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అందులో మహబూబీ అనే మహిళను మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ట్రాలీ వాహనం బోల్తా..
కలర్ డబ్బాల లోడుతో వెళ్తున్న ట్రాలీ వాహనం బోల్తాపడిన ఘటన మండలంలోని కేశవాపురం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. భద్రాచలం నుంచి పాల్వంచ వైపు వస్తున్న వాహనం కేశవాపురం శివారులోని సీతానాగారంకాలనీ సమీపంలో బీసీయం జాతీయ రహదారిపై బోల్తాపడింది. వాహనంలో ఉన్న కలర్ డబ్బాలు అన్ని రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.