ప్రజాహక్కుల రక్షణ కమ్యూనిస్టుల బాధ్యత
● సీపీఎం 24వ మహాసభల తీర్మానాల ఆధారంగా పోరాటాలు ● యర్రా శ్రీకాంత్ సంస్మరణ సభలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు
ఖమ్మంమయూరిసెంటర్: ప్రజాహక్కుల పరిరక్షణను కమ్యూనిస్టులు బాధ్యతగా భావిస్తారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీ.వీ.రాఘవులు తెలిపారు. ఇందులో భాగంగానే ఇటీవల మధురైలో జరిగిన పార్టీ 24వ ఆలిండియా మహాసభల్లో ఆహారం, ఇల్లు, ఉపాధి, విద్య, ఆరోగ్యం, పింఛన్లు దేశంలోని పౌరులందరి హక్కులుగా చేయాలని తీర్మానించినట్లు చెప్పారు. ఈ తీర్మానాల అమలుకు ఉద్యమాలు నిర్వహించాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మధురైలో సభలకు హాజరై గుండెపోటుతో మృతి చెందిన ఖమ్మంకు చెందిన సీపీఎం రాష్ట్ర నాయకుడు యర్రా శ్రీకాంత్ సంస్మరణ సభ ఖమ్మంలో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సభలో రాఘవులు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తే కార్మికులు సంక్షేమ ఫలాలు కోల్పోనున్నందున వచ్చేనెల 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చామని తెలిపారు. అలాగే, నూతన వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని చెప్పారు. కాగా, హక్కుల సాధనకు ఉద్యమిస్తూ, ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడమే శ్రీకాంత్‌కు నిజమైన నివాళి అని తెలిపారు.
కష్టాలొస్తే గుర్తొచ్చేది కమ్యూనిస్టులే..
ప్రజలకు ఏ కష్టం వచ్చినా కమ్యూనిస్టులు అండగా నిలుస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తెలిపారు. మంత్రి పదవి ఇవ్వకపోతే సంగతి చూస్తామని సీఎంను హెచ్చరించడం.. అలాంటి వారిపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చెబుతున్నారంటే పార్టీ శ్రేణులు గీత దాటే పరిస్థితులు వచ్చినట్టేనని చెప్పారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు అమలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కోసం పోరాడాల్సిన దశలో ప్రజా మన్ననలు పొందిన శ్రీకాంత్ దూరం కావడం నష్టదాయకమని తెలిపారు. ఈ సభలో సీపీఎం ఏపీ, తెలంగాణ, ఉమ్మడి జిల్లా నాయకులు ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌రావు, సీహెచ్.బాబూరావు, బండారు రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, బుగ్గవీటి సరళ, వై.విక్రమ్, యర్రా శ్రీకాంత్ సతీమణి సుకన్య, కుటుంబీకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు దండి సురేష్, యర్రా బాబు, రామాంజనేయులు, పునుకొల్లు నీరజ, డాక్టర్ యలమందలి రవీంద్రనాథ్, గుర్రం ఉమామహేశ్వరరావు, మెంతుల శ్రీశైలం, చిన్ని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


