కుడా.. ఏదీ మండలి జాడ?
కొత్తగూడెం వ్యూ
అక్టోబర్‌లో ఉత్తర్వులు..
పాల్వంచ, కొత్తగూడెం పట్టణాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ కొత్తగూడెం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటికీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 2024 అక్టోబర్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. కుడా ఏర్పాటుతో జిల్లా కేంద్రంలో భాగంగా ఉన్న కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందనే అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 40 ఏళ్ల క్రితమే కొత్తగూడెం, పాల్వంచ పూర్తి స్థాయి పట్టణాలుగా రూపాంతరం చెందాయి. అయితే గడిచిన రెండు దశాబ్దాలుగా ఈ రెండు పట్టణాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. ఈ రెండు మున్సిపాటీలు వేటికవే అన్నట్టుగా ఉండడంతో సమీకృత అభివృద్ధి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులు సైతం వేర్వేరుగా ఉండడంతో ప్రతీసారి రోడ్లు, డ్రెయినేజీలు, సెంట్రల్ లైటింగ్, మరమ్మతు వంటి రొటీన్ పనులే జరుగుతున్నాయి.
కార్పొరేషన్‌గా కొత్తగూడెం..
కొత్తగూడెం – పాల్వంచ పట్టణాలను కలుపుతూ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 2024 జూన్ 20న విజ్ఞప్తి చేశారు. దీనిపై అనేక తర్జనభర్జనల అనంతరం గత జనవరి 4న జరిగిన కేబినెట్ భేటీలో కొత్తగూడెం కార్పొరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ తర్వాత చట్టపరమైన అడ్డంకులు లేకుండా మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కార్పొరేషన్ బిల్లు ఆమోదం పొందింది. కొత్తగూడెం – పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్ మండలంలోని నాన్ షెడ్యూల్ గ్రామాలు ఏడింటిని కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రేపో మాపో గెజిట్ కూడా జారీ కానుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో వడివడిగా అడుగులు పడుతున్నా.. కుడా పాలక మండలి విషయంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.
నిధులు తెచ్చే ‘ప్రణాళిక’..
కుడాకు పాలకమండలి ఏర్పాటైతే దాని పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళిక, దానికి అవసరమైన నిధులను సేకరించే పనులు వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెండు పట్టణాల పరిధిలో వందల ఎకరాల భూములు ఉన్నా.. అవి రెవెన్యూవా లేక అటవీ శాఖవా, షెడ్యూల్ ఏరియానా, నాన్ షెడ్యూల్‌లో సింగరేణి లీజుకు తీసుకున్న భూములా అనేది తేలడం లేదు. ప్రస్తుతం ఉన్న పాలనా విభాగాలు ఈ అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. అయితే కుడా లాంటి చట్టబద్ధమైన సంస్థ ఏర్పాటైతే భూముల లెక్కల్లో స్పష్టత వచ్చేందుకు ఆస్కారం ఉంది. పనులు చేపట్టేందుకు అదనంగా ప్లానింగ్ అండ్ ఇంజనీరింగ్ విభాగం అందుబాటులోకి వస్తుంది. చట్టపరంగా నిధుల సమీకరణ, పెట్టుబడులను ఆకర్షించడం సాధ్యమవుతుంది. పట్టణాల్లో తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల కల్పనకు మున్సిపాలిటీలు పని చేస్తుండగా.. కుడా ద్వారా ఇతర అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ రెండు పట్టణాల ఉమ్మడి అవసరాల ఆధారంగా సరికొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు వీలుంటుంది.
పాలకులు లేని కొత్తగూడెం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ
కుడా ఏర్పాటుచేస్తూ గతేడాది అక్టోబర్‌లోనే ఉత్తర్వులు
పాలక మండలిపై మాత్రం దృష్టి పెట్టని ప్రభుత్వం
అభివృద్ధికి నోచుకోని జంట పట్టణాలు
చివరి అంకానికి చేరిన
కార్పొరేషన్ ఏర్పాటు
రూపురేఖలు మారనున్నాయ్..
గత ఏడాది కాలంగా కొత్తగూడెం – పాల్వంచ పట్టణాల దశ దిశ మార్చే అనేక అంశాలు చోటుచేసుకున్నాయి. కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు కొత్తగూడెంలో ఉన్న యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ను ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా అప్‌గ్రేడ్ చేశారు. ఆర్గానిక్ ఫార్మింగ్‌లో ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను కొత్తగూడెంలో నెలకొల్పేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దీనికి తోడు ఇల్లెందు – కొత్తగూడెం హైవే (ఎన్‌హెచ్ 930పీ) పనులు టెండర్ల దశలో ఉండగా కొత్తగూడెం – పాల్వంచకు సంయుక్తంగా బైపాస్ రోడ్డు, ఆటోనగర్, జూపార్కు తదితర ప్రాజెక్టులు ప్రతిపాదనల దశలో ఉన్నాయి. మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా కొత్తగూడెం – పాల్వంచల అభివృద్ధికి సంయుక్తంగా ప్రణాళికలు రచించాల్సిన అవసరం నెలకొంది.


