19 తులాల బంగారం రికవరీ
ఇల్లెందు: పోలీసులు చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి, సొత్తు రికవరీ చేశారు. సోమవారం ఇల్లెందు పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ ఎన్.చంద్రభాను వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. పట్టణంలోని సివిల్ లైన్ సత్యనారాయణపురం వెళ్లే రోడ్‌లో ఉన్న బి.కుమారస్వామి ఇంట్లో ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున చోరీ జరిగింది. 19 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, రూ. 5 వేల నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో సీఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో మూడు పోలీసు బృందాలు నిందితుడికి కోసం గాలింపు చేపట్టాయి. సోమవారం పట్టణంలో బుగ్గవాగు సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ యువకుడు తారసపడ్డాడు. పోలీసులను గమనించి పారిపోతుండగా పట్టుకుని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. హైదరాబాద్‌లోని ఉప్పుగూడు ప్రాంతానికి చెందిన రాజ్‌పుత్ కోరీ రాహుల్ చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసి సొత్తు రికవరీ చేశారు. అతనిపై గతంలో హైదరాబాద్‌లోని పలు స్టేషన్లతోపాటు ఇల్లెందు, కొత్తగూడెం టూ టౌన్ ప్రాంతాల్లో ఆరు చోరీ కేసులు ఉన్నాయి. సత్వరమే కేసు ఛేదించిన పోలీసులకు రివార్డులు డీఎస్పీ రివార్డు అందజేశారు. సమావేశంలో సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్‌ఐలు పఠాన్ నాగుల్ మీరా ఖాన్ పాల్గొన్నారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్


