కొత్తగూడెంఅర్బన్: వచ్చే విద్యా సంవత్సరానికి పటిష్ట ప్రణాళిక తయారు చేసుకోవాలని, విద్యారంగంలో జిల్లాను ముందుస్థాయిలో నిలపాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో ఎంఈఓలు, హెచ్‌ఎంలతో శుక్రవారం నిర్వహించిన వార్షిక సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ సంవత్సరం జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ వచ్చే విద్యా సంవత్సరంలో పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు విత్తనాలు సేకరించాలని, ఎక్కువ సేకరించిన పాఠశాలకు కాంప్లెక్స్ స్థాయిలో రూ.1000, మండల స్థాయిలో రూ. 5000, జిల్లాస్థాయిలో రూ. 50000 నగదు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. అనంతరం జిల్లాలోని 3,4,5 తరగతుల పిల్లలకు ఒక్కొక్కరికి రెండు నోటు పుస్తకాలను అందించే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. వేసవిలో విద్యార్థులు అభ్యసనకు దూరం కాకుండా ఐటీసీ సంస్థ ఇచ్చిన నోట్ పుస్తకాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడాలన్నారు. కాగా శుక్రవారం కొత్తగూడెం మండలంలోని హనుమాన్ బస్తీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలను అందించారు. డీఈఓ వెంకటేశ్వరాచారి, అధికారులు ఏ.నాగరాజు శేఖర్, ఎస్.మాధవరావు, ఎస్. శ్రీనివాస్, ఐటీసీ అధికారి చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్


